27 May, 2026 | 1:41 AM

30 వరకు వడగాల్పులు.. వర్షాలు

27-05-2026 12:52 AM

13 జిల్లాల్లో 46 డిగ్రీలు

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. వడగాల్పులతోపాటు వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఈనెల 30 వరకు ఈ పరిస్థితి ఉంటుందని తెలిపింది. మంగళవారం 13 జిల్లాల్లో 46 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండ జిల్లాలో 46.5 డిగ్రీలు నమోదు కాగా, జగిత్యాల్, భద్రాద్రి, కుమ్రంభీం, నిజామాబాద్, సూర్యాపేట్, ఖమ్మం, మంచిర్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, ములుగు, నిర్మల్ జిల్లాల్లో 46.0-46.4 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మెదక్‌లో అత్యల్పంగా 24.7 డిగ్రీలు నమోదైంది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత, వడగాల్పులతోపాటు పలు జిల్లాల్లో వర్షాలు కూడా కురువనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనెల 30 వరకు పలు జిల్లాల్లో వడగాల్పులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని తెలిపింది. ఈక్రమంలోనే బుధవారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో వడగాల్పులు వీస్తాయి.