calender_icon.png 6 November, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘స్వర్గం’ ఎక్కడో లేదు!

09-08-2024 12:00:00 AM

వేద విజ్ఞానం :

అంతరాళంలోనే విశ్వం ఉన్నది. ఇదే ఋషి దర్శనం. సత్య దర్శనం భౌతిక విజ్ఞానం నుండి తేలికగా లభించదు. దానికున్న పరిమితులే అందుకు కారణం. మూలభావన నుండి అంతర క్షేత్ర కేంద్రం నుండి దూరమవుతున్న కొద్దీ ఆవరణ శక్తి పలచనై శక్తి హీనమవుతుంది. 

నిజానికి మనకు అనుభవంలో ఉన్న ఈ ప్రపంచం, ఇంకా పూర్తిగా కనపడని ప్రపంచంలో అత్యల్ప భాగమే. ఈ కనిపిస్తున్నది సమగ్రం కాదు.

సమగ్రం, సంపూర్ణం అయిన దానిని తెలుసుకోవాలన్న జిజ్ఞాసే, ఊహే, అనల్ప కల్పనా శక్తే స్వర్గలోక వర్ణనకు దారి తీసింది. స్వర్గమంటే ఇంద్రియాతీత భావననే తప్ప అది మరొక లోకం కాదంటూనే, యమధర్మరాజు నచికేతసుడికి అగ్నికార్య విధానాన్ని బోధిస్తాడు. ఆతడి మనస్సును కల్పనా భూమిక వైపు నడిపిస్తాడు. లోకంలో వినిపించే శోకం అక్కడ వినబడదని, శరీరంలో ఏ మార్పూ జరగదని, ముసలితనం తగలదని, సుఖ సంతోషాలు సమృద్ధంగా ఉంటాయని వివరిస్తాడు.

“నచికేతా! అటువంటి స్వర్గం వైపు నడిపించగల అగ్నియజ్ఞం నీకు బోధిస్తాను. హోమకుండాన్ని నిరించే విధానాన్ని వివరిస్తాను” అంటుండగానే నచికేతసుడు క్షణకాలంలో ఆ విజ్ఞానాన్ని గ్రహించాడు. యముడికి ఆశ్చర్యం, ఆనందం కలిగి ఇకపై ఈ అగ్నికార్యం ‘నచికేతాగ్నిగా’ పిలవబడుతుందని ఆశీర్వదించాడు.

జీవితమే ఒక యజ్ఙం

‘నచికేతాగ్ని’ అంటే ‘స్వర్గానికి చేర్చే హోమమని’ అర్థం కాదు. జీవుడు, తన తనువు ఏర్పడటానికి కారణమైన తల్లిని, తన తనువు పోషింపబడటానికి కారణమైన తండ్రిని, తన తనువును, మనస్సును, బుద్ధిని సత్యాన్వేషణ వైపు గంభీరంగా నడిపించే గురువును గౌరవిస్తూ జీవించటం ప్రారంభించాలి. అంతేకాదు, ఆత్మవిద్య కోసం ఆరాటపడుతూ నిత్య నైమిత్తిక కర్మలను సత్యవ్రతంగా ఆచరిస్తూ, త్యాగ భావనతో జీవిత కాలాన్ని యజ్ఞకర్మగా ఎవరైతే భావిస్తుంటారో వారందరూ తామున్న భూలోకంలోనే స్వర్గ భావాన్ని అనుభవించగలరు.

యమబోధ నచికేతసుడి నిర్ణయాన్ని మరింత ధృడతరం చేసింది. స్వర్గ దర్శనం తన లక్ష్యం కాదు, గమ్యం అసలే కాదు. ప్రాపంచిక ఆకర్షణా వలయాన్ని దాటి, ఈ ప్రపంచం కల్పిస్తున్న మాయను దాటి సత్యాన్ని అనుభవ పరిధిలోకి తెచ్చుకోవటమే తన లక్ష్యం, గమ్యం.

మరొకరి మరణం, మనిషిని చింతనాత్మకుడిగా తీర్చిదిద్దుతుంది. జీవితమంటే ఏమిటి? మరణానంతరం జీవుడి స్థితి ఏమిటి? ఈ ప్రశ్నలన్నీ అందరూ ఎదుర్కొనేవే. నిజానికి ఇంతటి లోతైన ప్రశ్నలు కలగటానికి కూడా ఎంతో సాధన కావాలి. ఆంతరంగిక మధనం తీవ్రతరం కావాలి. నచికేతసుడి విషయంలో ఈ పూర్వరంగం ఇప్పటికే ఏర్పడింది. అందునా, సాక్షాత్ ధర్మదేవతైన యముడి ఆధ్వర్యంలో!

సత్యాన్వేషణకు రెండే మార్గాలున్నాయి. ప్రపంచ భావనలోనే నిలబడి, దాని పరిమితులను ఎరిగి, వెదుకులాటను కొనసాగిస్తూ ఉండటం; లేదా లౌకిక పరిధిని దాటి ఆలోచించగలగటం. హేతువాదులు, చార్వాకులు, ఆచార్యులు, యతులు, అవధూతలు, యోగులు, శోధకులు, తాత్వికులు ఒకరేమిటి అన్వేషణను గురించి చర్చించని వారు లేరు, దారులు వేరు కావచ్చు, తీరుతెన్నులు వేరు కావచ్చు.

మరణం తర్వాత ఆత్మ ఏమవుతుంది?

నచికేతసుడి సాధనా ఫలితం యమ దర్శనంతో ఆగక, ఆయనతో మాట్లాడగల అవకాశ రూపంలో లభించింది. క్షణం ఆలస్యం చేయకుండా యమధర్మరాజును సూటిగా నచికేతసుడు ప్రశ్నించాడు, 

“మరణానంతరం మనలో ఉన్న 

ఆత్మ ఏమవుతుంది?” అని.

“ఈ ధర్మం నీకు అర్థం కాదు. ఈ మర్మం అంత తేలికగా బోధ పడదు” అన్నాడు యముడు.

“మృత్యు దేవతవైన నీకంటే గురువెవరున్నారు? ఎవరు ఈ గుట్టు విప్పగలరు? దీనిని వివరించలేని వరాలు నాకెందుకు? కనుక, ఈ రహస్యాన్ని కరుణతో నాకు వివరించు” అన్నాడు నచికేతసుడు.

ఈ వరాలన్నీ నచికేతసుడిని పరీక్షించటానికే!

“నువ్విస్తానంటున్నవన్నీ నశించి పోయేవే! వాటి ప్రయోజనం పరిమితం. నీ దర్శనమే సౌభాగ్యం. నీతో ఉన్న ఈ కాలమే మరణ మెరుగని శాశ్వత స్థితి. సుఖసంతోషాలకంటే శాశ్వతానందాన్ని మనిషి కోరుకోవాలి. ఆ మార్గం చూపించు. మర్మం బోధించు. అది చాలు” అన్నాడు నచికేతసుడు.

యముడి మనసు ఆనంద తరంగితమైంది.

నచికేతసుడి వైపు కరుణతో చూశాడు. తన కర్తవ్య నిర్వహణకు యముడు ఉపక్రమించాడు.

- వీఎస్‌ఆర్ మూర్తి