13-01-2026 04:30:50 PM
న్యూఢిల్లీ: గత ఐదేళ్లుగా వీధి జంతువులకు సంబంధించిన నిబంధనల అమలులో లోపంపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, కుక్క కాటు(dog bite) ఘటనలకు రాష్ట్రాలు భారీ పరిహారం(Heavy fine) చెల్లించాలని ఆదేశిస్తామని మంగళవారం పేర్కొంది. కుక్క కాటు సంఘటనలకు కుక్కలను ప్రేమించేవారు, వాటికి ఆహారం పెట్టేవారు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని జస్టిస్‌లు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్.వి. అంజారియాతో కూడిన ధర్మాసనం(Supreme Court) వెల్లడించింది. పిల్లలకు, వృద్ధులకు కుక్క కాటు వల్ల మరణం, గాయాలకు రాష్ట్ర ప్రభుత్వాలు భారీ పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
కుక్క కాట్లకు వాటిని ప్రేమించేవారు, ఆహారం పెడుతున్న వారిని బాధ్యులుగా చేస్తామని ధర్మాసనం తెలిపింది. ''మీకు ఈ జంతువులపై అంత ప్రేమ ఉంటే, వాటిని మీ ఇంటికి ఎందుకు తీసుకువెళ్లరు? ఈ కుక్కలు రోడ్లపై తిరుగుతూ, ప్రజలను కరుస్తూ, భయపెట్టడం ఎందుకు?'' అని జస్టిస్ నాథ్ అన్నారు. జస్టిస్ మెహతా, జస్టిస్ నాథ్ అభిప్రాయాలతో ఏకీభవిస్తూ, "9 ఏళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేసినప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? వాటికి ఆహారం పెట్టే సంస్థనా? ఈ సమస్యను మేము పట్టించుకోకుండా ఉండాలని మీరు కోరుకుంటున్నారా?" అని పేర్కొన్నారు. సంస్థాగత ప్రాంతాలు, రోడ్ల నుండి ఈ విచ్చలవిడి జంతువులను తొలగించాలని అధికారులను ఆదేశిస్తూ నవంబర్ 7, 2025న ఇచ్చిన ఉత్తర్వును సవరించాలని కోరుతూ దాఖలైన అనేక పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది.