పిడుగులతో పాటు కురిసిన భారీ వర్షం వనికిన జనం
వరదకు కొట్టుకుపోయిన కల్వర్టు
బోథ్,(విజయక్రాంతి): సోనాల బోథ్ మండలాల్లో సోమవారం అర్ధరాత్రి పిడుగులతోపాటు కురిసిన వర్షం ప్రజలను వనికించింది. మెరుపు వేగంతో పిడుగు లు రావడంతో పాటు పెద్ద పెద్ద శబ్దాలు వస్తుండడంతో ప్రజలు నిద్రలు లేక సతమతమయ్యారు. మండల కేంద్రంలోని కస్తూరి మధుకర్ అనే వ్యాపారికి చెందిన పాత బట్టల దుకాణంపై పిడుగు పడటంతో దుకాణంపై భాగంలో కొంత దెబ్బతిన్నది. పిడుగు పడడంతో పాత అంగడి బజార్ ప్రాంతంలో నీ కొందరి ఇళ్లలో టీవీలు ఫ్రిజ్లు ఫ్యాన్లు కాలిపోయాయని అంటున్నారు.
ఇక సోనాల మండలంలోని పెద్దగూడ గ్రామం సమీపంలో వాగుపై ఈ ఏడాది నిర్మించిన బ్రిడ్జి పక్కన రోడ్డు కోతకు గురైంది. వరద ఉధృతి అధికంగా రావడంతో బ్రిడ్జి కింది భాగంలో వేసిన పైపుల వద్ద విరిగిపోయిన చెట్ల కొమ్మలు అడ్డంగా పడడంతో నీరు కల్వటు పక్కనుండి ఉధృతంగా మారడంతో కోతకు గురి కావడం జరిగింది. వంతెన ఇరువైపులా వాల్ నిర్మించాలి.
దశాబ్దాల కాలంగా గ్రామస్తులు ఎదురుచూస్తున్న కల్వర్టు నిర్మాణం పూర్తి అయిందన్న సంబరం కలగానే మిగిలిపోయింది. కల్వర్టు కు ఇరువైపులా కోతకు గురి కావడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. కల్వర్టుకు ఇరువైపులా సైడ్ వాల్స్ నిర్మాణం చేపట్టి మధ్యలో సిసి రోడ్డు వేసినట్లయితేనే తమకు ఉపయోగపడుతుందని గ్రామస్తులు అంటున్నారు. జిల్లా అధికారులు అదనంగా నిధులు మంజూరు చేసి కల్వర్టు సమస్యను పరిష్కరించాలని పెద్దగూడ గ్రామస్తులు కోరుతున్నారు.






