08-10-2025 01:24:51 PM
హైదరాబాద్: తెలంగాణ అంతటా బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు(Heavy rain) కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(India Meteorological Department) అంచనా వేసింది. గత వారం రోజులుగా హైదరాబాద్‌లో వాతావరణం అనూహ్యంగా మారుతుంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో చెల్లాచెదురుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం ఎండ కొట్టినప్పటికీ మధ్యాహ్నం అయ్యే సరికి నగరంలోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, షేక్ పేట్, మణికొండ, రాయదుర్గం, అమీర్ పేట్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, యూసుఫ్ గూడ, ఎస్ఆర నగర్, ఫిలింనగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది.
ఒక్కసారిగా వర్షం పడడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్‌లోని అనేక ప్రధాన ప్రాంతాలలో మంగళవారం కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చురుగ్గా ఉన్న వాతావరణ నిఫుణులు నగరంలోని కొన్ని ప్రాంతాలలో మధ్యాహ్నం నుండి రాత్రి వరకు చెల్లాచెదురుగా కానీ తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని సూచించారు. రాష్ట్రంలోని నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌కర్నూల్, వనపర్తి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, యాదాద్రి భువనగిరి సహా దక్షిణ, తూర్పు తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది.