08-10-2025 03:30:24 PM
భయాందోళనలకు గురైన విద్యార్థులు ఉపాధ్యాయులు..
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా యాలాల మండలం అక్కంపల్లి ప్రాథమిక పాఠశాలలో పాములు ప్రత్యక్షం కావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. ప్రధానోపాధ్యాయులు ఉమారాణి, ఉపాధ్యాయులు గోపాల్ తెలిపిన వివరాల ప్రకారం... పాఠశాలలో ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు 92 మంది విద్యార్థులతో పాఠశాల నడుస్తుంది. నేడు యధావిధిగా తరగతులు జరుగుతున్న సమయంలో ఐదవ తరగతి విద్యార్థులు పాములను చూసి ఉపాధ్యాయులకు సమాచారం అందించారు.
ఉపాధ్యాయులు స్థానికుల సహాయంతో మూడు నాగుపాము పిల్లలను కొట్టి చంపేశారు. మరో రెండు పాములు తరగతి గదిలోనే రంధ్రంలోకి వెళ్లాయని వారు తెలిపారు. పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేకపోవడం మరియు ఐదవ తరగతి గది వర్షానికి ఓ మూల శిథిలావస్థకు చేరింది. పాఠశాల పరిసరాల లో చెట్లు, పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో పాములు, తేళ్లు, విషపురుగులకు ఆవాసంగా మారాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలకు కాంపౌండ్ వాల్ తోపాటు శిథిలావస్థకు చేరిన తరగతి గది మరమ్మతులు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రు కోరుతున్నారు.