నగరంలో దంచికొట్టిన వాన
పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం
ట్రాఫిక్ జామ్‌తో వాహనదారుల ఇబ్బందులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో మంగళవా రం వర్షం దంచికొట్టింది. దీంతో పలు ప్రాంతాల్లో రహదారులన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్‌తో వాహ నదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చాలా చోట్ల చెట్లు నేలకొరిగిపోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ బృందాలు రోడ్లపై నిలిచిన వరద నీటిని తొలగించే చర్యలు చేపట్టారు. అత్యధికంగా పీర్జాదిగూడలో 6.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమో దయింది.
చెట్లు నేలకొరగడం, విద్యుత్ తీగ లు తెగిపడడం, రోడ్లపై నీరు నిలవడం తదితర సమస్యలకు సంబంధించి అధికారులకు 30 ఫిర్యాదులు అందాయి. కాగా, నగరంలో కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వరద నీరు తొలగించేందుకు డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
పిడుగుపాటుకు పాడి ఆవు మృతి
సిద్దిపేటరూరల్, జూన్ 11: పిడుగుపాటుకు పాడి ఆవు మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. రైతు బండారి కనకయ్యకు చెందిన పాడి ఆవుపై పిడుగుపడడంతో మృత్యువాత పడింది.
మూడ్రోజులు వర్షాలే
హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): రాష్టంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాలకు భారీ వర్ష సూచన చేసింది. మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.






