2 July, 2026 | 5:36 AM

విపత్తులను సమర్థంగా ఎదుర్కోవాలి

12-06-2024 02:07 AM

డీఆర్‌ఎఫ్ బృందాలను ఓఆర్‌ఆర్ దాకా విస్తరించాలి 

సమీక్ష సమావేశంలో సీఎస్ శాంతికుమారి 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షాలు, విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ బృందాలను ఓఆర్‌ఆర్ దాకా విస్తరించాలని, నగరంలో కురిసే భారీ వర్షాలు, విపత్తులను ఎదుర్కో వడానికి పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ఈ మేరకు మంగళవారం సచివాలయంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జ్ కమిషనర్ ఆమ్రపాలి, ఈవీడీఎం డైరెక్టర్ ఎన్  ప్రకాశ్ రెడ్డి తదితర అధికారులతో నిర్వహించిన సమావేశంలో వరదలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాటా ్లడు తూ.. హైదరాబాద్ నగరంతో పాటు ఓఆర్‌ఆర్ దాకా ఆకస్మిక వర్షాలు, వరదలు వచ్చినా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు ఉన్నట్టు తెలిపారు.

ఇప్పటికే జీహెచ్‌ఎంసీలో 30 డీఆర్‌ఎఫ్ బృందాలు ఉండగా, నూతనంగా మరో 15 బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ పరిధిలో పెద్ద సంఖ్యలో ఫార్మా కంపెనీలు ఉన్నందున కెమికల్ ఫైర్ ప్రివెన్షన్‌కు ప్రత్యేక శిక్షణతో కూడిన బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నగరవ్యాప్తంగా మున్సిపల్, పోలీసు, విద్యుత్, జలమండలి సంబంధిత శాఖల సమన్వయంతో 141 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్టు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర నగరాలలో కూడా డీఆర్‌ఎఫ్ బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.