మూడు రోజులూ భారీ వర్షాలు
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. దీంతో తెలంగాణలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్లా, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
బుధవారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, గురువారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఈమేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. సోమవారం సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిస్తే, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది.






