5 June, 2026 | 1:30 AM

జిల్లాల్లో జోరు వర్షం

05-06-2026 12:23 AM

కరీంనగర్/కామారెడ్డి/సుల్తానాబాద్/కొత్తపల్లి, జూన్ 4 (విజయక్రాంతి): గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జోరు వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిలింది. వీణవంక, తిమ్మాపూర్ వంటి ప్రాంతాలతో పాటు జిల్లాలోని పలు చోట్ల వర్షం కురిసింది. కరీంనగర్ నగరంలోని భగత్ నగర్, అంబేద్కర్ స్టేడియం వెనుక ప్రాంతంలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కరీంనగర్ రూరల్ మండలంలోని పాశం కనుకయ్య ఇంటిపై పిడుగు పడింది. ఈ పిడుగు పాటుకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇల్లు పైన ప్రహరీ కొద్దిగా కూలింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. గత కొన్ని రోజుల నుండి తీవ్ర ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ భారీ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. కామారెడ్డి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.

పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ డ్రెయినేజీ నీటితో చెరువులను తలపించాయి. వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపో యాయి. వర్షపు నీటిలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రధానంగా నిజాంసాగర్ చౌరస్తా, లయోలా స్కూల్ చౌరస్తా పాత బస్టాండ్, సిరిసిల్ల రోడ్, విద్యానగర్ కాలనీ, బతుకమ్మ కుంట, పంచముఖి హనుమాన్ కాలనీ ప్రాంతాల్లో రోడ్లు నీటితో నిండిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి.