09-12-2025 11:05:44 PM
సిద్దిపేట క్రైం: సిద్దిపేట జిల్లాలో మొదటి విడత ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ నెల 11న గజ్వేల్, దౌల్తాబాద్, జగదేవ్ పూర్, మర్కుక్, ములుగు, రాయపోల్, వర్గల్ మండలాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉంటుందని చెప్పారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ వ్యక్తులు గుంపులుగా గుమికూడరాదని సూచించారు. పోలింగ్‌కు 44 గంటల ముందు నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు సైలెంట్ పీరియడ్ అమల్లో ఉంటుందని, ఈ సమయంలో ఎన్నికల సభలు, సమావేశాలు, ఇంటింటా ప్రచారం, లౌడ్‌స్పీకర్ వినియోగం, ర్యాలీలు, బైక్ ర్యాలీలు నిర్వహించరాదని హెచ్చరించారు.
పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపల, ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లే మార్గంలో ఎలాంటి ప్రచారం, అడ్డంకులు, ఉద్రేకం లేదా ప్రలోభాలను సృష్టించకూడదని సూచించారు. పోలింగ్ కేంద్రం నుంచి 200 మీటర్ల లోపల ఎలాంటి బూత్‌లను ఏర్పాటు చేయడానికి అనుమతి లేదని తెలిపారు. అభ్యర్థి లేదా వారి పక్షాన ఒక్క బూత్‌ను మాత్రమే 200 మీటర్ల పరిధికి వెలుపల ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి బూత్‌కు ఒక టేబుల్ రెండు కుర్చీలు మాత్రమే అనుమతించబడతాయని సూచించారు. బూత్‌ల ఏర్పాటుకు సంబంధించి రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా తెలియజేయాలని, స్థానిక అధికారుల నుంచి లిఖితపూర్వక అనుమతి పొందాలని సూచించారు. బూత్ లో ఇచ్చే చీటీలపై అభ్యర్థి పేరు, గుర్తు, రాజకీయ పార్టీ పేరు ఉండకూడదని తెలిపారు. పోలింగ్ స్టేషన్ ప్రాంగణంలో లేదా 100 మీటర్ల లోపల ఫోన్లు, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడానికి అనుమతి లేదన్నారు.
ఎన్నికల భద్రత దృష్ట్యా, మద్యం దుకాణాలు (వైన్ షాపులు) డిసెంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 12వ తేదీ ఉదయం 10 గంటల వరకు పూర్తిగా మూసి ఉంచాలని సూచించారు. ఎవరైనా మద్యం అక్రమంగా రవాణా చేసినా, నిల్వ చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఓటర్లు పోలింగ్ కేంద్రం లోపలికి గుర్తింపు కార్డ్( ఓటర్ కార్డు, ఆధార్ కార్డు)తో మాత్రమే అనుమతించబడతారని తెలిపారు. పోలింగ్ కేంద్రంలోకి సిరా, వాటర్ బాటిళ్లు, కత్తులు లేదా భద్రతా సిబ్బంది అనుమానించే ఇతర ఎలాంటి వస్తువులను కూడా వెంట తీసుకురావడానికి అనుమతి లేదని హెచ్చరించారు. పోలింగ్ పూర్తయ్యే వరకు కేంద్రాల పరిసరాలలో స్థానికేతరులు, బయటి వ్యక్తులు ఎవరూ ఉండరాదని సూచించారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, ప్రదర్శనలు నిర్వహించడానికి అనుమతి లేదన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కేసులు నమోదు చేస్తామని సీపీ విజయ్ కుమార్ హెచ్చరించారు.