09-12-2025 11:02:29 PM
ప్రజా వేదిక రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషు..
హనుమకొండ (విజయక్రాంతి): సమాజాన్ని క్యాన్సర్ లాగా పట్టి పీడిస్తున్న అవినీతికి వ్యతిరేకంగా అన్ని స్థాయిలలో ఉద్యమించాలని ప్రజా వేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు అన్నారు. యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసిన సందర్భంగా డాక్టర్ శేషు మాట్లాడుతూ అన్ని వ్యవస్థలలో అవినీతి పెచ్చురిల్లి పోవడం వలన సామాన్య ప్రజలు బాధితులుగా మారిపోతున్నారని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, సివిల్ సప్లై, మున్సిపల్ శాఖలలో అవినీతి తాండవిస్తుంది.
జనన, మరణ ధ్రువీకరణ పత్రాల నుండి విద్యార్థులకు కావలసిన కుల ధ్రువీకరణ పత్రాల వరకు గృహ నిర్మాణ అనుమతులు వరకు అధికారులు, ఉద్యోగులు అవినీతికి తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2020లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 7 అవినీతి కేసులు నమోదు అయితే 2025 నాటికి ఆ సంఖ్య 19కి పెరగటం అంటే అవినీతి ఏ స్థాయిలో పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. అవినీతికి వ్యతిరేకంగా యాంటీ కరప్షన్ ఆర్గనైజేషన్ ని త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నామని తెలియజేశారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తండు నాగయ్య మాట్లాడుతూ ట్రాన్స్ఫరెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రకారంగా 180 దేశాలలో 38 పాయింట్స్ తో భారతదేశం అవినీతిలో 96వ స్థానంలో ఉంది కాబట్టి అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చినప్పుడే ప్రభుత్వాలు అవినీతి నిర్మూలనకు బలమైన చట్టాలు చేసి అమలుపరుస్తుందని అభిప్రాయపడ్డారు. పాలనాపరమైన అవినీతి, నాయకులు, ప్రభుత్వాలు, అధికారులు అవినీతి వలన సామాన్య ప్రజలు సమిధలుగా మారిపోతున్నారని వాపోయారు.