09-05-2025 11:32:46 PM
అదనంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్
మందమర్రి,(విజయక్రాంతి): మందమర్రి మండలంలోని తుర్కపల్లి గ్రామంలో 30 సంవత్సరాల క్రితం ఇంటి స్థలాన్ని కొనుక్కొని, ఇల్లు కట్టుకొని ఉంటున్న కుటుంబంపై, గతంలో ఆ భూమిని అమ్మిన వ్యక్తి వారసులు దౌర్జన్యం చేస్తూ, ప్రస్తుతం ఉన్నటువంటి భూమి విలువకు అదనంగా డబ్బులు చెల్లించాలని బెదిరిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు మేడి శ్రీమతి, ఆమె భర్త స్వామి, కుమారుడు శ్రావణ్ లు తెలిపారు. శుక్రవారం పట్టణ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాధితులు మాట్లాడుతూ... గత 30 సంవత్సరాల క్రితం మండలంలోని సారంగపల్లి గ్రామానికి చెందిన అగ్గు బాలయ్య తన వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి, ప్లాట్లుగా చేసి అమ్మకాలు నిర్వహించగా, అందులో స్థలాన్ని(ప్లాట్) కొనుగోలు చేసి, ఇల్లు నిర్మించుకొని ఉంటున్నామని, ఆ ఇంటికి గ్రామపంచాయతీ నుండి ఇంటి నెంబర్ సైతం కేటాయించడం జరిగిందన్నారు.
ఇల్లు శిథిలావస్థలో చేయడంతో నూతనంగా ఇంటిని నిర్మించుకుందామని అనుకుంటుండగా అగ్గు బాలయ్య కుమారుడు అగ్గు మల్లయ్య, అతని భార్య లక్ష్మి, కుమార్తె సంధ్య కుటుంబ సభ్యులందరూ కలిసి తమ కుటుంబం సభ్యులపై దాడి చేశారని ఆరోపించారు. ఇది తమ పట్టా భూమి అని, మీ పేరు పై పట్టాలేదని, ప్రస్తుతం భూమికి ఉన్న విలువకు తగ్గట్టుగా మరింత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చి, వ్యవసాయేతర భూమిగా రికార్డులోకి మార్చకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని వాపోయారు. ఈ విషయమే అగ్గు మల్లయ్య అతని కుటుంబ సభ్యులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. సంబంధిత అధికారులు, పోలీసులు స్పందించి, మల్లయ్య కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.