29-06-2025 12:00:00 AM
లీనా చందావర్కర్.. ముఖంపై పసిపిల్లల మృదుత్వం.. అద్భుతమైన స్వరం.. అభినయంతో కట్టిపడేసే కళ్లు.. ఆమెను 17 ఏళ్ల వయసుకే బాలీవుడ్ సూపర్ స్టార్‌ను చేసేశాయి. నిజానికి చిన్నతనం నుంచి లీనాకు చదువు అబ్బలేదు. 60, 70ల్లో వెండితెరను ఏలిన మహారాణి. కెరీర్‌లో సూపర్ స్టార్‌గా రాణిస్తున్న క్రమంలోనే.. వీధిరాత ఆమెను మరోలా కాటేసింది. కెరీర్‌లో అద్భుతంగా ఎదిగినా నిజ జీవితం విషాదభరితం.
15 ఏళ్ల లీనాను చిత్ర నిర్మాతలు ‘బేబీ’ అని పిలిచేవారు. మొదటిసారి సునీల్ దత్‌తో కలిసి ‘మన్ కా మీట్’లో ఆరంగేట్రం చేసింది. లీనాకు నటనలో ఓనమాలు నేర్పింది సునీల్ దత్ భార్య నర్గీస్. 1969 నుంచి 1979 మధ్యకాలంలో టాప్ హీరోల సరసన నటించింది. 1971లో రాజేష్ ఖన్నాతో కలిసి నటించిన ‘మెహబూబ్‌కి మెహందీ’ ఆమె నటనకుగానూ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నది.
26 ఏళ్లకే వితంతువుగా..
లీనా రీల్ లైఫ్‌తో పోలిస్తే.. నిజ జీవితం మా త్రం విషాదభరితం అని చెప్పాలి. దురదృష్టకరమైన విషయం ఏంటంటే.. 26 ఏళ్లకే రెండు పెళ్లిళ్లు చేసుకోవడం.. వితంతువుగా మారడం. ఇవి రెం డు ఘటనలు ఆమె జీవితంపై మానసిక ప్రభావా న్ని చూపించాయి.
మొదటి పెళ్లి గోవా మొదటి సీఎం దయానంద్ బందోద్కర్ కుమారుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త సిద్ధార్థ్ బందోద్కర్‌తో 1975లో పనాజీలో అంగరంగవైభవంగా వివాహం చేసుకున్నది. వివాహం అయినా 11 రోజుల తర్వాత భర్త తన రివాల్వర్‌ను శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ అయి ప్రమాదవశాత్తూ మరణించాడు.
మళ్లీ ప్రేమలో..
పెళ్లున 11 రోజులకు భర్త చనిపోవడంతో చు ట్టూ పక్కల వాళ్లు, బంధువులు సూటిపోటి మాటలతో లీనాను వేధించేవాళ్లు. భర్త మరణానికి ఆమె కారణమని పుకార్లు వినిపించేవి అప్పట్లో. కొంతకాలం తర్వాత ముంబైకి వెళ్లింది. అప్పుడే కిషోర్ కుమార్ దర్శకత్వం వహించిన ‘ప్యార్ అజ్న బీహై’ చిత్రానికి ఆమె సంతకం చేసింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే కిషోర్ కుమార్, లీనా ఒకరినొకరు ప్రేమించుకున్నారు.
భరించలేని బాధ
మొదట్లో కిషోర్ కుమార్ ప్రేమను అంగీకరించడానికి లీనా ఇష్టపడలేదు. ఎందుకంటే అప్పటికే కిషోర్ కుమార్‌కు మూడుసార్లు వివాహం చేసుకున్నందుకు. దానికి తోడు లీనా తండ్రి కిషోర్‌తో పెళ్లికి ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించడని భావించింది. కిషోర్, లీనా తండ్రిని ఒప్పించి 1980లో ప్రేమ వివాహం చేసుకున్నారు.
అభద్రత భావం
పెళ్లున ఏడు సంవత్సరాలకు అంటే 1987లో కిషోర్ గుండెపోటుతో మరణించాడు. కిషోర్ మరణం తర్వాత దాదాపు 20 ఏళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. తర్వాత భర్త జ్ఞాపకాలను తిరిగి అభిమానులతో పంచుకోవడానికి ‘కె ఫర్ కిషోర్’ ప్రోగ్రాంలో పాల్గొని అభిమానులతో ముచ్చటించింది. అందులో భాగంగా ఓ అభిమాని కిషోర్‌తో మీకున్న మధురమైన జ్ఞాపకం ఏంటి? అడిగాడు..
దానికి ఆమె సమాధానం ‘కిషోర్ నా మార్గదర్శి, తత్వవేత్త. కిషోర్ ఎప్పుడూ నా కోసం ‘జిందగీ కే సఫర్ మే గుజార్ జాతే హై జో ముకమ్’ పాట పాడేవాడు. పెళ్లిపై నాకు పూర్తిగా నమ్మకం లేదు.. కానీ ప్రేమపై ఉన్నదని కిషోర్ పరిచయంతో తెలిసింది. అయితే పెళ్లి తర్వాత చాలా అభద్రతకు గురయ్యా.. ఎందుకంటే నేను కిషోర్ నాలుగోవ భార్యను.. ఐదో భార్యను కూడా తీసుకువస్తాడేమోనని’ అన్నది లీనా.