06-07-2025 12:00:00 AM
శరీరాన్ని అందంగానే కాదు, సువాసన వెదజల్లేలా ఉంచుకోవడం కొందరికి ఇష్టం. తాజాగా ఉన్న అనుభూతిని ఇచ్చి రోజంతా ఉత్సాహంగా ఉంచేందుకు ఇది సహకరిస్తుంది. అలాగని ఘాటైన అత్తర్లు రాసేస్తే సరిపోతుంది అనుకోవడానికి లేదు.
అలాంటివి ఎదుటివారిని ఇబ్బంది పెడతాయి. మనకు మన చుట్టుపక్కల వారికి కూడా హాయిగొలిపేలా రోజంతా శరీరం సువాసన వెదజల్లేందుకు కొన్ని సూత్రాలను సూచిస్తున్నారు చర్మ సౌందర్యనిపుణులు. అవేంటో చూద్దాం..
పర్‌ఫ్యూమ్ వేసుకునే ముందు సువాసన వెదజల్లే బాడీ లోషన్ లేదా క్రీమ్‌ని శరీరానికి రాయాలి. తర్వాత అరచేతి పైన నాడులుండే చోట, మెడ, చెవుల వెనుక పర్‌ఫ్యూమ్‌ని అప్లు చేయడం వల్ల శరీరం నుంచి ఎక్కువసేపు మంచి వాసన వస్తుంటుంది.
స్నానం చేసేటప్పుడు చెమట వచ్చే శరీర ప్రాంతాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అలాగే చర్మం మీద మృతకణాలను తొలగించేలా స్క్రబ్ లేదా మాస్క్‌ల లాంటివి వేసుకుంటూ ఉండాలి.
చర్మ రంధ్రాలను మూసేయకుండానే, చెమట వాసన రాకుండా చేసే డియోడరెంట్లను ఎంచుకోవాలి. రసాయనాలు తక్కువగా ఉండి, సెన్సిటివ్ చర్మానికి కూడా పనికొచ్చేవాటిని వాడాలి. అలాగే స్నానం చేసిన వెంటనే చర్మాన్ని పొడిగా తుడిచి డియోడరెంట్ రాయడం వల్ల ఎక్కువసేపు తాజాగా ఉన్న అనుభూతి కలుగుతుంది.