న్యాయాధికారిపై హైకోర్టు చర్యలు
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): భార్యాభర్తల విడాకుల కేసులో సుప్రీంకోర్టు స్టే విధించినప్పటికీ రంగారెడ్డి జిల్లా నుంచి కేసును ఏపీలోని శ్రీకాకుళం కోర్టుకు బదిలీ చేసిన రంగారెడ్డి జిల్లా ఫ్యామిలీ కోర్టు న్యాయాధికారి సహా సిబ్బందిపై హైకోర్టు చర్యలు చేపట్టింది. ఈ విషయాన్ని రిజిస్ట్రార్ జనరల్ సుప్రీంకోర్టుకు నివేదించారు. రంగారెడ్డి జిల్లా ఫ్యామిలీ కోర్టు నుంచి శ్రీకాకుళం ఫ్యామిలీ కోర్టుకు కేసు బదిలీ వివాదంపై తెలంగాణ, ఏపీ హైకోర్టుల్లోని పిటిషన్లు ఉన్నాయి.
వీటిపై సుప్రీంకోర్టు స్టే ఆదేశాలిచ్చింది. స్టే ఆర్డర్‌ను పట్టించుకోకుండా కేసును రంగారెడ్డి జిల్లా ఫ్యామిలీ కోర్టు బదిలీ చేయడం, శ్రీకాకుళం జిల్లా కోర్టు విడాకులు మంజూరు చేశాయి. దీనిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏపీ, తెలంగాణ హైకోర్టులను ఆదేశించింది. నివేదిక తెప్పించుకున్న రిజిస్ట్రార్ జనరల్ దానిని హైకోర్టు న్యాయ మూర్తుల పరిపాలనా కమిటీకి అందజేశారు. ఆ కమిటీ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా న్యాయాధికారి, బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు సుప్రీంకోర్టుకు తెలియజేశారు.






