9 July, 2026 | 2:53 AM

‘బద్రీనాథ్’ నిధుల దుర్వినియోగంపై ఉన్నతస్థాయి విచారణ

09-07-2026 01:07 AM
  1. ముగ్గురు సభ్యులతో కమిటీ
  2. అక్రమాలపై ఇప్పటికే బీకేటీసీ అంతర్గత విచారణ 
  3. ఒకరి సస్పెన్షన్

డెహ్రాడూన్, జూలై 8: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయ విరాళాల్లో చోటు చేసుకున్న అవకతవకలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. సీఎం పుష్కర్‌సింగ్ ధామి ఆదేశాల మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దించింది. ఈ బృందం బుధవారం దర్యాప్తు ప్రారంభించింది. బద్రీనాథ్ ఆలయ ప్రాంగణంలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటు ఇప్పటి వరకు భక్తులు హుండీల్లో సమర్పించిన నగదు, ఆన్‌లైన్ విరాళాలు, నగదు నిర్వహణ, లెక్కింపునకు సంబంధించిన విధానాలు, ఇతర పత్రాలను సమీక్షిస్తున్నారు.

ఆలయ విరాళాల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మెరుగుపరిచేందుకు.. ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంస్కరణలు తీసుకురావాలని కమిటీకి సూచించారు. బద్రీనాథ్  టెంపుల్ కమిటీ (బీకేటీసీ) ఉత్తరాఖండ్‌లో బద్రీనాథ్‌తో పాటు మరో 44 ఆలయాలు, పలు పాఠశాలలు, ధర్మశాలలను నిర్వహిస్తోంది.