9 April, 2026 | 1:14 PM

గంజాయి మత్తులో సీఐ కొడుకులమంటూ హల్చల్

09-04-2026 11:22 AM

ఏ కారణం లేకుండా ముగ్గురిపై దాడి 

 సీసీ కెమెరాల్లో రికార్డు..

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): సుజాతనగర్ మండలం వేపలగడ్డ గ్రామంలో, గంజాయి మత్తులో అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ఎలాంటి కారణం లేకుండానే సీఐ కొడుకును అని  చెప్పుకుంటూ కొందరు వ్యక్తులు ముగ్గురిపై, దాడి చేసిన ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే… మంగళవారం సాయంత్రం సుమారు 7:30 గంటల సమయంలో పాలు పోసేందుకు బండిపై వెళ్తున్న వ్యక్తిని ,కొందరు దుండగులు వెంబడించారు. అతడు నందనవనం కాలనీలో పాలు పోసే ఇంటికి చేరుకున్న వెంటనే అక్కడికి చేరుకుని అతనిపై దాడికి పాల్పడ్డారు.

ఈ సమయంలో గొడవను ఆపేందుకు వచ్చిన మరో ఇద్దరిపై కూడా అదే మూక దాడి చేసింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం… ముందుగా బుల్లెట్ బండిపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు దాడిని ప్రారంభించగా, వారి వెనుక ఆటోలో వచ్చిన మరో ఏడుగురు వ్యక్తులు కలిసి మొత్తం గుంపుగా దాడి చేసినట్లు తెలిపారు. దాడి సమయంలో వారు గంజాయి మత్తులో ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తాము కొత్తగూడెం సీఐ కొడుకుని అని  చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో పూర్తిగా రికార్డయ్యాయి. దాడిలో గాయపడిన ముగ్గురు వ్యక్తులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  ఎలాంటి కారణం లేకుండా జరిగిన ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.