12 March, 2026 | 9:22 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రీ ప్రైమరీ విద్య

08-01-2026 06:13 PM

హైదరాబాద్: ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అనుగుణంగా ప్రీ ప్రైమరీ విద్యను అందించే విధానాన్ని అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యా రంగం పట్ల తీసుకుంటున్న చర్యలను రేవంత్ రెడ్డి వివరించారు.

జాతీయ విద్యా విధానం తరహాలోనే తెలంగాణలోనూ త్వరలోనే ప్రత్యేక విద్యా విధానం తీసుకురాబోతున్న విషయాన్ని తెలిపారు. విద్యా విధానం కోసం ఇప్పటికే ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించామని, త్వరలోనే ఆ పాలసీని అమలులోకి తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ ప్రారంభించడమే కాకుండా పిల్లలను పాఠశాలలకు తీసుకెళ్లడానికి రవాణా సౌకర్యం కల్పించే ఆలోచన కూడా చేస్తున్నట్టు వివరించారు.

రాష్ట్రంలోని ఐటీఐలను ఏటీసీలుగా తీర్చిదిద్దుతున్న వివరాలను, అలాగే ప్రతి నియోజకవర్గంలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. విద్యా రంగంలో సమూల మార్పుల్లో భాగంగా చేపడుతున్న సంస్కరణలతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ #YIIRS ఏర్పాటు చేస్తున్న వివరాలను తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఒకేచోట మినీ యూనివర్సిటీ స్థాయిలో ఈ స్కూల్స్‌ను నిర్మిస్తున్నట్టు చెప్పారు.

ఏటీసీగా మార్చిన మల్లేపల్లి (ఐటీఐ) #ATCని సందర్శించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హిమాచల్‌ప్రదేశ్ మంత్రికి సూచించారు. రాష్ట్రంలో నెలకొల్పుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంపైన ఆసక్తి చూపించిన హిమాచల్ ప్రదేశ్ మంత్రి అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను అందించాలని కోరారు. ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థను పటిష్టపరచాలన్న ముఖ్యమంత్రి విజన్‌ను రోహిత్ ఠాకూర్ అభినందించారు. ఈ సమావేశంలో విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.