18 March, 2026 | 1:54 AM

జూబ్లీహిల్స్‌లో హిందూ ముస్లిం సౌహార్ద ఇఫ్తార్

18-03-2026 12:09 AM

హైదరాబాద్, మార్చి : జైహో(జైభారత్ అసోసియేషన్ ఫర్ ఇంటెగ్రిటీ, హార్మనీ అండ్ వన్నెస్) ఆధ్వర్యంలో మంగళవారం జూబ్లీహిల్స్‌లోని రౌనాక్’స్ హై, మాన్ మేడ్ హిల్స్, రౌనాక్ ఎస్టేట్ వద్ద హిందూముస్లిం సౌహార్ద ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ మతాలు, వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొని సోదరభావం, ఐక్యత, లౌకిక విలువలను ప్రతిబింబించారు.

ఈ కార్యక్రమానికి అసఫ్ జాహీ వంశానికి చెందిన 9వ నిజాం, ప్రస్తుతం ఆ వంశ పరంపర వారసత్వానికి సంరక్షకుడిగా ఉన్న నవాబ్ రౌనాక్ యార్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. పలువురు సామాజిక నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నవాబ్ రౌనాక్ యార్ ఖాన్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం ఎప్పటినుంచో సామాజిక సౌహార్దానికి ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు.ఇఫ్తార్ వంటి కార్యక్రమాలు వివిధ మతాల మధ్య అనుబంధాన్ని మరింత బలపరచడమే కాకుండా నిజాం కుటుంబానికి ఉన్న లౌకిక సంప్రదాయాలను కొనసాగించేలా చేస్తాయని అన్నారు.

మధు యాష్కి గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎప్పటినుంచో భిన్న సంస్కృతులు, సంప్రదాయాలను గౌరవిస్తూ ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని అన్నారు.రౌనాక్ యార్ ఖాన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించడం అభినందనీయమని, వివిధ సంస్థలతో కలిసి పండుగలను నిర్వహించడం ఐక్యతను బలోపేతం చేస్తుందని కొనియాడారు.ఈ కార్యక్రమాన్ని జైహో సంస్థ వ్యవస్థాపకుడు రమణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు.