4 July, 2026 | 2:44 PM

నేరాల నియంత్రణకు ప్రజల సమాచారమే ఆయుధం

04-07-2026 01:38 PM
  1. కమ్యూనిటీ కాంటాక్ట్ తో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
  2. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు 
  3. 121 ద్విచక్ర వాహనాలు, 36 ఆటోలు, 2 కార్లు, ఒక తల్వార్, 18 బీర్ బాటిళ్లు, 12 క్వార్టర్ మద్యం బాటిళ్లు స్వాధీనం
  4. కత్తులు, మారణాయుధాలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు
  5. గంజాయి, సైబర్ మోసాలు, రోడ్డు భద్రత, ప్రజల భాగస్వామ్యంపై అవగాహన
  6. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర

కామారెడ్డి, జూలై 4 (విజయక్రాంతి): పోలీసులకు ప్రజలు ఇచ్చిన సమాచారంతోనే నేరాలను నియంత్రించగలుగుతామని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(District SP Rajesh Chandra) అన్నారు. శనివారం ఉదయం కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల వద్ద  కామారెడ్డి పోలీసు శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 5.00 గంటల నుంచి 8.30 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 160 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర, మాట్లాడుతూ, పోలీసు-ప్రజల మధ్య విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడం, నేరాల నివారణలో ప్రజలను భాగస్వాములను చేయడమే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అన్నారు. ప్రతి పౌరుడు చట్టాలను గౌరవిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు.

ఈ తనిఖీల్లో 121 ద్విచక్ర వాహనాలు, 36 ఆటోలు, 2 కార్లు గుర్తించారు. వీటిలో 11 వాహనాలు నంబర్ ప్లేట్లు లేకుండా ప్రయాణం చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే 18 బీర్ బాటిళ్లు, 12 క్వార్టర్ మద్యం బాటిళ్లు, ఒక తల్వార్ స్వాధీనం చేసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా ఎస్పీ తెలిపారు. సోషల్ మీడియాలో కత్తులు, తల్వార్లు, ఇతర మారణాయుధాలతో ఫొటోలు, వీడియోలు పోస్టు చేసి యువతను రెచ్చగొట్టేలా లేదా ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా వ్యవహరించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణా, నిల్వ, విక్రయం, కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, స్నేహాలు, రోజువారీ అలవాట్లను గమనించాలని సూచించారు. రోజులో కనీసం ఒకపూట కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేయడం ద్వారా పిల్లల ఆలోచనలు, ప్రవర్తనను అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. పిల్లలలో అనుమానాస్పద మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని సూచించారు. గంజాయి వ్యసనానికి గురైన వారి గురించి సమాచారం అందిస్తే వారికి డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా కౌన్సెలింగ్, చికిత్స అందించి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి పోలీసు శాఖ సహకరిస్తుందని చెప్పారు.

సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగాల పేరుతో మోసాలు, డిజిటల్ అరెస్ట్, ఓటీపీ, కేవైసీ, పెట్టుబడుల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.కామారెడ్డి జిల్లాలో ఇటీవల ఛేదించిన పలు తీవ్రమైన దొంగతన కేసుల్లో ప్రజలు అందించిన సమాచారం కీలకపాత్ర పోషించిందన్నారు. ఒక కేసులో పంచర్ షాపు కార్మికుడు ఇచ్చిన సమాచారం, మరో కేసులో విలేకరి అందించిన సమాచారం ఆధారంగా నిందితులను అరెస్టు చేయడం సాధ్యమైందని తెలిపారు. అందువల్ల కాలనీలు, గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, దొంగతనాలు, గంజాయి, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే డయల్–100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

అదేవిధంగా రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు, ట్రిపుల్ రైడింగ్, అతివేగం, రాంగ్ రూట్ ప్రయాణం, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి ఇంటి, వ్యాపార సంస్థ వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు, నేరాల నియంత్రణతో పాటు నిందితులను గుర్తించడంలో అవి కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో అనుమానితులతో జిల్లా ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి సమస్యలు, జీవనశైలిని తెలుసుకున్నారు. నేరాలకు పూర్తిగా దూరంగా ఉండి మంచి ప్రవర్తన కనబరిస్తే చట్టపరమైన నిబంధనల మేరకు రౌడీషీట్ల తొలగింపును పరిశీలిస్తామని తెలిపారు. అలాగే కరాటేలో ప్రతిభ కనబరిచిన యువతను అభినందించి, క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, కామారెడ్డి టౌన్ ఎస్‌హెచ్‌ఓ నరహరి, కామారెడ్డి రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, బిక్కనూర్ ఇన్‌స్పెక్టర్ నరేష్, ఆర్‌ఐలు సంతోష్, నవీన్, కృష్ణ, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు , పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.