సోలార్ పంచాయతీగా హీరాపూర్..
- సోలార్ పంపుసెట్లకు రైతుల గుర్తింపు పై సర్వే..
- సీఎం రేవంత్ రెడ్డి రాకతో ముమ్మురంగ సర్వేలు..
ఉట్నూర్, మే 12( విజయ క్రాంతి ): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామపంచాయతీ సోలార్ పంచాయతీగా ఏర్పడనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెలలో హీరాపూర్ గ్రామపంచాయతీకి నేరుగా వచ్చి పంచాయతీ పరిధిలోని ఏడు గ్రామాల పటేల్ ల తో పాటు గిరిజనులు, రైతులతో ప్రత్యేకంగా వారితో వారి సమస్యలను పరిష్కరించనున్నారు. 1991-92 సంవత్సరంలో జీవనధార పథకంలో నిర్మించిన వ్యవసాయ బావులతోపాటు రైతులకు కావలసిన కొత్త బోర్ బావులను మంజూరు చేసి వాటికి సోలార్ పంప్ సెట్ లో ఏర్పాటు చేయుటకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు విద్యుత్ శాఖ సీఎం డి కర్నాటి వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్శి షా లు హీరాపూర్ పంచాయతీని సందర్శించి రైతుల సమస్యలను, గిరిజనుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు.
సాగునీటి కోసం విద్యుత్ సౌకర్యం లేక సాగునీరు ఉపయోగించడం లేదని రైతులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అధికారులు సోలార్ పంప్ సెట్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. అధికారుల నిర్ణయం మేరకు గ్రామాల్లోని 214 మంది రైతులను గుర్తించి వారికి పంపుసెట్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రైతు పంట పొలాలను విద్యుత్ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా సర్వేలను మంగళవారం శ్రీకారం చుట్టారు. పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల్లో అధికారులు పర్యటించి రైతులకు కావలసిన సాగునీటి ఏర్పాట్లను , సోలార్ పంప్ సెట్ లను ఏర్పాటుపై సర్వేలు నిర్వహించారు.
* 34 ఏళ్ల వ్యవసాయ బావులకు మోక్షం..
1991-92 లో అప్పటి ప్రభుత్వం గిరిజన రైతులకు సాగునీరు అందించేందుకు జీవనధార పథకంలో వ్యవసాయ బావులు మంజూరు చేశారు. మంజూరైన బావులను రైతులు తవ్వుకొని వ్యవసాయ బావులు 34 ఏళ్లుగా విద్యుత్ సౌకర్యం లేక నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. వ్యవసాయ బావులు మంజూరు చేసిన ఐటీడీఏ అధికారులు గిరిజన రైతులకు సాగునీరు వినియోగించే విధంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వపరంగా విద్యుత్ శాఖకు చెల్లించవలసిన డీడీలను చెల్లించి ఏళ్లు గడిచిన నేటికీ విద్యుత్ సౌకర్యం కలగలేదు.
స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజన గ్రామాల పర్యటనకు వస్తున్న సందర్భంగా 34 ఏళ్లుగా పంట చేనులో వృధాగా ఉన్న వ్యవసాయ బావులకు సోలార్ పంప్ సెట్ లో ద్వారా సాగునీరు అందించే అవకాశం కలుగుతుందని గిరిజన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ బావులు లేని గిరిజన రైతుల భూములను అధికారులు పర్యటించి బోరు బావులు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో హీరాపూర్ పంచాయతీ పరిధిలోని గిరిజన రైతులకు సాగునీరును సద్వినియోగం చేసుకొని పంటలు పండిస్తామని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో గిరిజన గ్రామాల్లోని రైతులకు సాగునీరు అందుతుందని రైతులంటున్నారు. సాగునీటితోపాటు గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు సైతం కలుగుతాయని గిరిజన గుడాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..






