13 May, 2026 | 1:32 AM

ఏబీ స్విచ్‌ల ఏర్పాటుతో...- విద్యుత్ అంతరాయాలకు అడ్డుకట్ట...

13-05-2026 12:15 AM

మంచిర్యాల, మే 12 (విజయక్రాంతి) : విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో మంచిర్యాల సర్కిల్ లో విద్యుత్ వ్యవస్థ బలోపేత పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. విద్యుత్ లైన్లలో సాంకేతిక లోపాలు, చెట్ల కొమ్మలు తగలడం, భారీ వర్షాలు, ఈదురు గాలులు వంటి కారణాలతో ఏర్పడే అంతరాయాలను తక్షణమే గుర్తించి సమస్య ఉన్న ప్రాంతానికి మాత్రమే విద్యుత్ సరఫరాను నిలిపివేసి, మిగతా ప్రాంతాలకు నిరాటంకంగా విద్యుత్ అందించడానికి తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ పీ డీ సీ ఎల్) కృషి చేస్తుంది. ఇందులో భాగంగానే సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ లైన్ లలో ఏబీ స్విచ్ లు ఏర్పాటు చేస్తుంది.

ఏబీ స్విచ్‌ల ఏర్పాటుతో...

గతంలో చిన్న లైన్ ఫాల్ట్ వచ్చినా మొత్తం గ్రామం లేదా ఫీడర్ పరిధిలోని కాలనీలన్నింటికీ విద్యుత్ సరఫరా నిలిచిపోయేది. ఏబీ స్విచ్ ల ఏర్పాటుతో సమస్య ఉన్న ప్రాంతంలో మాత్రమే సరఫరా నిలిపివేసి, మిగతా ప్రాంతాలకు విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా కానుంది. నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి ఏబీ స్విచ్ ల ఏర్పాటు ఎంతో కీలకంగా మారింది. వీటితో విద్యుత్ అంతరాలను తక్షణమే గుర్తించి సమస్య ఉన్న ప్రాంతానికి తప్ప ఇతర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేయవచ్చు. ఇప్పటి వరకు మంచిర్యాల సర్కిల్ పరిధిలో క్షేత్ర స్థాయిలో గ్రామాలలో సింగిల్ ఫేజ్ 320 ఏబీ స్విచ్ లు విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు.

వీటి ద్వారా గ్రామాలలో ఎక్కడైన అంతరాయం ఏర్పడితే లైన్ మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా కేవలం సింగిల్ ఫేజ్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద నిలిపి మిగతా ప్రాంతమంతా విద్యుత్ సరఫరా కానుంది. ఏబీ స్విచ్ తో విద్యుత్ అంతరాయం ఒకే పరిధికి మాత్రమే పరిమితం కానుంది. అలాగే త్రిఫేజ్ లైన్ లలో ఇప్పటి వరకు 413 ఏబీ స్విచ్ లు ఏర్పాటు చేశారు. ఈ అధునాతన సాంకేతికత అమలుతో గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాలలో విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గి వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా కానుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.