ఆక్రమణలపై హెచ్ఎండీఏ ఉక్కుపాదం
శంషాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
రాజేంద్రనగర్: హెచ్ఎండిఏ అధికారులు అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపారు. శంషాబాద్ పట్టణంలో హెచ్ఎండిఏ స్థలాల్లో అక్రమంగా వెలిసిన కట్టడాలను భారీ పోలీసు బందోబస్తు నడుమ నేలమట్టం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని ఎయిర్ పోర్టు ర్యాంపు పక్కనే హెచ్ఎండీఏ భూములు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంతకాలంగా కొందరు అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఈ మేరకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో శనివారం హెచ్ఎండీఏ అడిషనల్ కలెక్టర్ షర్మిల ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. ఎయిర్ పోర్ట్ ఫ్లైఓవర్ నిర్మించే సమయంలో ర్యాంపు చుట్టూ ఉన్న భూములను హెచ్ఎండీఏ అప్పట్లోనే స్వాధీనం చేసుకుందన్నారు. అయితే కొందరు అక్రమార్కులు ఆ భూముల్లో షెడ్లు నిర్మించారు. దీంతో కూల్చివేతలు చేపట్టినట్లు ఆమె వివరించారు. నిబంధనలు ఉల్లంఘించి మరో మారు నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు.




