calender_icon.png 5 December, 2024 | 12:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘నీలగిరి’ ఆశలు మూసీ!

08-11-2024 12:41:21 AM

‘నల్లగొండ’కు శాపాన్ని!

నల్లగొండలో నాడు స్వచ్ఛతకు ప్రతిరూపాన్ని.. సాగుకు వర దాయినిని.. కానీ, ఇప్పుడు నేను కాలుష్య రక్కసి పీడితురాలిని.. రసాయన ఆవశేషాల విషపు తరంగాన్ని.. భూగర్భ జలాలను మలినం చేసి, భూసారాన్ని పీల్చేసిన కల్మషురాలిని..  ప్రక్షాళన కోసం ఎదురుచూస్తున్న ఆశావహురాలిని !

  1. జల కాలుష్యంతో ‘ఉమ్మడి నల్లగొండ’లో సాగు కుదేలు
  2. వరి సన్న రకాల సాగుపైనా దెబ్బ
  3. ఆయకట్టులో దొడ్డు రకాలే సాగు
  4. చేతికొచ్చిన ధాన్యాన్ని తిండిగింజలుగా భావించని రైతాంగం
  5. రసాయనిక అవశేషాల భయంతో సన్నబియ్యం వైపే చూపు

యాదాద్రి భువనగిరి/ నల్లగొండ/సూర్యాపేట/ నవంబర్ 7 (విజయక్రాంతి)/ అబ్దుల్లాపూర్‌మెట్: మూసీపై ఆధారపడి ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ ప్రజల జీవనం ఉండేది. రైతులు, వ్యవసాయ కూలీలు, మత్స్యకారులకు నది జలాల జీవిక దొరికేది. ఒకప్పుడు నదీ జలాలు స్వచ్ఛంగా ఉండేవి.

నాడు ఎలాంటి ఎరువులు, రసాయనాలు వినియోగించకుండానే పంటలు బాగా పండేవి. రైతులు ఆయకట్టులో ఉద్యాన పంటలైన కూరగాయలు, పండ్లు, పూల తోటలు సైతం పండించేవారు. నదీ తీరంలో చెలిమలు తీస్తే కూడా వాటిలో స్వచ్ఛమైన నీరు ఊరేది. మూడు దశాబ్దాల నుంచి నది కాలుష్యం బారినపడడంతో భూసారం తగ్గిపోయింది.

నీరు తాగిన పశువులకు గర్భస్రావం సాధారణమైంది. వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసిన కూలీలకు చర్మవ్యాధులు పరిపాటి అయింది. యాదాద్రి జిల్లాలో ఫార్మా కంపెనీలు, పరిశ్రమల నుంచే వ్యర్థాలు నదిలో కలవడంతోనే ఈ దయనీయ పరిస్థితి.

పరిశ్రమల నుంచి సిబ్బంది పెద్ద పెద్ద ట్యాంకర్లలో వ్యర్థాలను తీసుకొచ్చి రాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా కలపడం, కొన్ని యాజమాన్యాలు సరాసరి నదిలోకి పైప్‌లైన్లు వేసి వ్యర్థాలను వదలడమే కాలుష్యానికి కారణం.

జలాలను శుద్ధి చేసే వ్యవస్థలు కూడా పెద్దగా లేకపోవడంతో  కాలుష్యం నానాటికీ పెరుగుతూనే ఉంది. మూసీ కలుషిత ప్రభావం ఉమ్మడి జిల్లా పరిధిలో 10 లక్షల మందిపై ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

దొడ్డు రకాల సాగు..

నది కాలుష్య ప్రభావం పండించే పంటలపైనా పడింది. మూసీ కాలుష్యం కారణంగా పరీవాహక ప్రాంత రైతులు కేవలం దొడ్డు బియ్యమే పండించేవారు. సన్నరకాల జోలికి వెళ్లేవారు కాదు. సన్నాలు సాగు చేస్తే మొక్కల ఎదుగుదల లేకపోవడం, ఒకవేళ మొక్కలు ఎదిగినా దిగుబడులు తగ్గిపోతున్నాయి. రైతులు స్వయంగా వరి పండించి, పంట చేతికొచ్చిన తర్వాత ధాన్యాన్ని సరాసరి మిల్లులకు తరలించేవారు.

భార్యాబిడ్డలకు ఆ అన్నం పెట్టేందుకు వారికి మనస్కరించేది కాదు.  అలాగే రైతులు కూరగాయలు, ఆకు కూరలు అపరాల పంటలకు దూరమయ్యారు. పరీవాహకంలోని భూగర్భజలాలు కలుషితం కావడంతో ఆ ప్రభావం తాడిచెట్లపైనా పడింది. గీత కార్మికులు అక్కడి తాడి చెట్ల నుంచి తీసిన కల్లు కూడా నాణ్యతను కోల్పోయింది.

నదిలో మత్స్యకారులు పట్టిన చేపల్లోనూ రసాయనిక అవశేషాలు ఉన్న విషయం అనేకసార్లు రుజువైంది. నది నీరు తాగిన పశుపక్ష్యాదులకూ ఆయుక్షీణమని అనేక శాస్త్రీయ అధ్యయనాలు తేల్చాయి. ఒకప్పుడు ఈ ప్రాంతంలోని సుమారు 50 చెరువుల్లో మత్స్యకారులు చేపల పెంచేవారు. కాలుష్యం కారణంగా తర్వాత చేపల పెంపకం నిలిచిపోయింది.

ప్యూరిఫైడ్ వాటర్ వైపు పరుగులు..

దశాబ్దాల పాటు ఉమ్మడి జిల్లావాసులు మూసీ జలాలు తాగారు. సూర్యాపేట పట్టణవాసుల తాగునీటి అవసరాలకు దశాబ్దాల నుంచి 10 క్యూసెక్కుల జలాలు మూసీ ప్రాజెక్ట్ నుంచి తరలివచ్చేవి. కాలుష్యం కారణంగా 8 ఏండ్ల నుంచి జలాల తరలింపు నిలిచిపోయింది.

ప్రస్తుతం పాలేరు జలాశయం నుంచి ప్రత్యేక పైపులైన్ ద్వారా సూర్యాపేటతో పాటు పరిసర ప్రాంతవాసులకు తాగునీరు అందుతున్నది. ప్రస్తుతం ఇక్కడ మూసీ అంటేనే ప్రజలకు ఏవగింపు ఉంది. ఆర్థికభారమైనా ఇప్పుడు ప్రజలు ప్యూరిఫైడ్ నీళ్లే తాగుతున్నారు. ఒకవేళ బోరు నీరు తాగాల్సి వచ్చినా.. వాటిని ఫిల్టర్ చేసే తాగుతున్నారు. 

ఈసారైనా ప్రక్షాళన జరిగేనా?

మూసీ జలాలను శుద్ధి చేసేందుకు పాలకులు తగినన్ని నీటిశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నది. ప్రస్తుతం రెండుమూడు శుద్ధి కేంద్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో జలాల శుద్ధి అంతంతమాత్రంగా జరుగుతోంది. నదిలో కాలుష్య జలాలు పారుతుండంతో పరీవాహక ప్రాంతంలో దోమల బెడద కూడా పెరిగింది.

ఫలితంగా ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. నది ప్రక్షాళనపై దశాబ్దాల నుంచి పాలకులు ఇస్తుస్తున్న హామీలు నీటిమూటలుగానే మిగిలాయి. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మూసీ రివర్‌ఫ్రంట్ బోర్డు ఏర్పాటు చేసింది.

రూ.800 కోట్లతో నది ప్రక్షాళన చేస్తామని ఆ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. తర్వాత ప్రాజెక్ట్ కాస్తా అటకెక్కింది. షరామామూలే అన్న చందంగా పరిస్థితి మారింది. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి మూసీ పునర్జీవంపై అనేక హామీలు ఇవ్వడంతో ఉమ్మడి జిల్లా ప్రజల్లో తిరిగి అశలు చిగురించాయి.

మూసీ ప్రాజెక్ట్‌తో మేలు

నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, తుంగతుర్తి నియోజకవర్గాల తాగు, సాగునీటి అవసరాల కోసం కేతేపల్లి మండలం సోలిపేట వద్ద ప్రాజెక్టు నిర్మించాలని 1954లో నాటి ప్రభుత్వం నిర్ణయించింది. 1963లో ప్రాజెక్ట్ పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చింది. ప్రాజెక్ట్ అసలు నీటి నిల్వసామర్థ్యం 5.5 టీఎంసీలు కాగా, పూడిక చేరి ప్రస్తుత సామర్థ్యం 4.46 టీఎంసీలకు తగ్గింది. ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాల్వల ద్వారా మొత్తం 50 చెరువులు, కుంటలు నిండుతాయి. ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లోనూ భూగర్భజలాలు పెరిగాయి. ఆయకట్టు కూడా వేలాది ఎకరాల్లో ఉంది.

నదిలో నాణెం వేస్తే కనిపించేది..

ఒకప్పుడు మూసీ నీరు స్వచ్ఛం గా ఉండేది. ఇప్పుడు మురుగు నీటి గా మారింది. మూసీ వైపు వెళ్లాలంటే ఇప్పుడు కంపు. మా చిన్నతనంలో మూసీలోనే స్నానం చేసేవాళ్లం. నదిలోనే బట్టలు ఉతుక్కునేవాళ్లం. చేతి లో ఉన్న నాణేన్ని నదిలో వస్తే అది అడుగుకు వెళ్లినా పైకి కనిపించేది. అలాంటి మూసీలో ఇప్పుడు అడు గు పెట్టలేని పరిస్థితి. రాష్ట్రప్రభుత్వం మూసీని బాగు చేస్తమంటే ఆనందమేసింది. 

 వీరస్వామి యాదవ్, 

స్థానికుడు, కుత్బుల్లాపూర్

మేం పండించిన తిండిగింజలనూ తినకపోయేటోళ్లం..

మూసీ కాలుష్య ప్రభావం చుట్టూ ఉన్న పంటలపైనా పడుతున్నది. నది చుట్టుపక్కల పొలాల్లో పనిచేస్తున్న కూలీలు చర్మవ్యాధుల బారిన పడుతున్నారు. గతంలో మా ప్రాంతం మొత్తంలో దొడ్డు రకం ధాన్యం పండించే వాళ్లం. కలుషిత నీటితో సాగైందని మేం వాటిని తినేవాళ్లం కాదు. ఆర్థిక భారమైనా సన్నం బియ్యం దుకాణంలో కొనేవాళ్లం.

 మాదగోని అంజయ్యగౌడ్

రైతు, తుడిమిడి, నల్లగొండ జిల్లా

దిగుబడి రాక సాగు చేస్తలేం..

మా కుటుంబం గతంలో మూసీ జలాలతో పంటలు పండిం చాం. నది జలాలు కలుషితం కావడంతో తర్వాత బంద్ చేసినం. పంట లు సాగు చేస్తలేం. మాకు సొంత భూమి ఉన్న తిండి గింజలు సైతం పండించలేకున్నాం. బయట దుకాణంలనే బియ్యం కొంటున్నం. మా భూమిల ఇప్పుడు పశుగ్రాసం పెంచుతున్నం. పాడి రైతులు ఇచ్చే సొమ్ముతోనే కుటుంబాలను పోషించుకుంటున్నం.

 ఏర్పుల మల్లేశం, రైతు

కుత్బుల్లాపూర్, రంగారెడ్డి జిల్లా

పశుగ్రాసమూ కలుషితమవుతున్నది..

మూసీ చుట్టుపక్కల ప్రస్తుతం పశుగ్రాసం మాత్రమే పెరుగుతున్నది. కాలుష్యం కారణంగా ఆ పశుగ్రాసాన్ని జీవాలు పెద్దగా తినడం లేదు. పాల దిగబడి ఆశించిన మేర లేదు. దూడలు ఎదిగి వయసుకు వచ్చినా ఎదకు రావడం లేదు. కాలుష్యం పాడి పరిశ్రమనూ దెబ్బతీసింది. పెంచుతున్న పశువులను కాపాడుకునేందుకు మేం బోరు నీళ్లనే తాపిస్తున్నం.

 అలుగునూరి ఈదయ్య, రైతు

పాములపాడు, నల్లగొండ జిల్లా