17-02-2026 02:10:21 AM
ఆందోళనలు.. పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తతలు
హంగ్ మున్సిపాలిటీల్లో 11 చోట్ల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా
కొన్నింటిలో కోరం లేకపోవడం.. మరికొన్నింటిలో ఓట్లు సమానంగా ఉండటంతో..
రణరంగంగా తొర్రూరు, జనగామ
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య పంచాయితీ
హైదరాబాద్/మహబూబాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పురపాలికల్లో చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నా యి. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. మరికొన్ని చోట్ల ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఉద్రిక్త తలు, ఇతర కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా 11 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. తొర్రూరు, ఇల్లెందు, సుల్తానాబాద్, ఇబ్రాహీపట్నం, కాగజ్‌నగర్, క్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామలో చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నికను వివిధ కారణాలతో అధికారులు వాయిదా వేశారు.
తొర్రూరులో..
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా, బీఆర్‌ఎస్-9 కాంగ్రెస్-7 వార్డులు గెలుచుకున్నాయి. దీంతో ఇక్కడ ఎక్స్‌ఆఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఎక్స్‌ఆఫీషియో ఓట్లతో కాంగ్రెస్, బీజేపీల బలాలు సమానమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఎంపీ కడి యం కావ్య ఓటుపై బీఆర్‌ఎస్ అభ్యంతరం చెప్పి.. ఆందోళన వ్యక్తంచేసింది. వరంగల్‌లో ఎక్స్ అఫీషియో సభ్యురా లుగా ఉన్న కావ్య.. తిరిగి తొర్రూరులో ఎలా ఓటు వేస్తారని బీఆర్‌ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఒకరినొకరు తోసుకోవడం, పోటాపోటీ నినాదాలు చేసుకోవడంతో పాటు ఇరు వర్గాలు దాడి చేసుకునే పరిస్థితి రావడంతోఎన్నికను వాయిదా వేశారు.
జనగామలో..
జనగామ మున్సిపాలిటీలోనూ తొర్రూరు పరిస్థితే నెలకొన్నది. జనగామలో 30 వార్డులకు గాను కాంగ్రెస్‌కు 12, మిత్రపక్షమైన సీపీఎంకు 1 స్థానంతో కలిపి మొత్తం 1౩ వార్డులు గెలిచింది. బీఆర్‌ఎస్ కూడా 13 వార్డులు గెలుచుకున్నది. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎక్స్‌ఆఫీషియో ఓట్లుగా నమోదు చేసుకోవడంతో ఇరు పార్టీలు 14 ఓట్లతో సమానంగా ఉన్నాయి.
బీఆర్‌ఎస్‌కు చెందిన 28వ కౌన్సిలర్‌ను కిడ్నాప్ చేశారని ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగడం, ఇరువురి మధ్య ఉద్రిక్తత నెలకొనడంతో జనగామ ఎన్నికను వాయి దా వేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణు లు దాడులు చేసుకునే వరకు వెళ్లడంతో ఎన్నిక వాయిదా వేశారు. డోర్నకల్‌లో కోరం లేక ఎన్నికను వాయిదా వేశారు.
కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, సంగారెడ్డి జిల్లా ఇంద్రే శం పాలకవర్గం ప్రమాణస్వీకారం కూడా వాయిదా పడిం ది. ఈ రెండింటిలో ప్రమాణస్వీకారానికి 21 మంది సభ్యు లు హాజరుకాకపోవడంతో కోరం లేనందున ఎన్నికను వాయిదా వేశారు. క్యాతనపల్లితో పాటు మిగతా మున్సిపాలిటీల్లోనూ కోరం లేకపోవడంతో వాయిదా వేశారు.
ఇబ్రహీంపట్నంలో..
ఇబ్రహీంపట్నంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసు కుంటున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన 13 మంది కౌన్సిలర్లతో పాటు మరో స్వతంత్ర అభ్యర్థిని బీఆర్‌ఎస్ పార్టీ క్యాంపునకు తరలించింది. బీఆర్‌ఎస్‌కు మరో బీజేపీ అభ్యర్థి సైతం మద్దతు తెలపడంతో ఆ సంఖ్య 15కు చేరింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా బీఆర్‌ఎస్ మద్దతుదారులు 14 మంది మాత్రమే మున్సిపల్ ఆఫీసుకు వచ్చారు. క్యాంపునకు వెళ్లిన ఆకుల యాదగిరి సమావేశానికి రాలేదు.
అతను అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. చైర్మన్ పదవి ఇస్తే కాంగ్రెస్‌కు మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆకుల యాదగిరి కాంగ్రెస్‌కు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాదగిరి మిస్సింగ్ కావడంతో బీఆర్‌ఎస్ వర్గీయులే అతన్ని దాచి ఉంచొచ్చని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. యాదగిరి కనిపించడం లేదంటూ వారు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.
ఆమనగల్లులో..
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో మున్సిపల్ ఆఫీసులోకి ఎమ్మెల్యే కసిరెడ్డి బీజేపీ కౌన్సిలర్లను అనుమతించారని బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన చేశాయి. పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఇక్కడ కాంగ్రెస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నది. అందుకు బీజేపీ మద్దతు తెలపడం గమనార్హం. బీఆర్‌ఎస్ ౮, బీజేపీ ౬, కాంగ్రెస్ నుంచి ఒకరు మాత్రమే గెలిచారు. బీఆర్‌ఎస్‌కు చెందిన ఒక కౌన్సిలర్ మత్యా నాయక్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు.
బీజేపీ కౌన్సిలర్లు కూడా మత్యా నాయక్‌కు మాత్రమే మద్దతు ఇస్తామని తెలుపడంతోనే కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ బలం రెండుకు చేరగా.. బీజేపీ మద్దతు, ఎంపీ ఎక్స్‌అఫిషియో ఓటుతో కాంగ్రెస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకన్నది. తమకు అధిక సంఖ్యలో కౌన్సిలర్లు ఉన్నాకూడా తమకు చైర్మన్ పీఠాన్ని దూరం చేసేందుకే బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయంటూ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అంతేకాకుండా ఎన్నికల హాల్‌లోకి బీఆర్‌ఎస్ కౌన్సిలర్లను అనుమతించలేందంటూ నిరసన వ్యక్తం చేశారు.