13 April, 2026 | 9:56 PM

ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలి

13-04-2026 08:51 PM

– జనాభా గణన తెలంగాణ రాష్ట్ర సంచాలకులు భారతి హోళ్ళికేరి

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జనాభా లెక్కలలో భాగంగా మే 11 నుంచి నిర్వహించనున్న ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జనాభా గణన తెలంగాణ రాష్ట్ర సంచాలకులు భారతి హోళ్ళికేరి సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఇండ్ల గణన కార్యక్రమ నిర్వహణ, అవసరమైన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇండ్ల జాబితా బ్లాక్‌లను రూపొందించడం, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం, మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలను పూర్తిచేయాలని సూచించారు. ప్రక్రియ నిర్వహణలో పొరపాటులకు తావు లేకుండా పర్యవేక్షించాలని తెలిపారు.

జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ కె. హరిత, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇండ్ల గణన కార్యక్రమాన్ని నిబంధనల ప్రకారం అధికారుల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో 1,689 ఇండ్ల జాబితా బ్లాక్‌లను గుర్తించామని, 10 శాతం అదనపు సిబ్బందితో కలిపి 994 మంది ఎన్యుమరేటర్లు, 174 మంది సూపర్వైజర్లు విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. వీరికి త్వరలో మండలాల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.