రోడ్డు భద్రత నియమాలు పాటిద్దాం.... ప్రమాదాలను అరికడదాం
జవహర్ నగర్ ఎస్హెచ్ఓ సైదులు
జవహర్ నగర్,(విజయక్రాంతి): రోడ్డు భద్రత నియమాలు పాటించి ప్రమాదాలను అరికడదామని ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యాన్ని చేరాలని జవహర్ నగర్ ఎస్ హెచ్ ఓ సైదులు పిలుపునిచ్చారు. ఎరైవ్_ ఆలైవ్ కార్యక్రమంలో భాగంగా జవహర్ నగర్ పోలీసులు, జిహెచ్ఎంసి అధికారులు సంయుక్తంగా సోమవారం జవహర్ నగర్ లో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా సైదులు మాట్లాడుతూ... ప్రజా సహకారం రోడ్డు భద్రతలో కీలకమని, రోడ్డు భద్రతలో అవగాహన ముఖ్యమని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించి, సుఖమయ ప్రయాణానికి సహకరించాలన్నారు.
ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా లైసెన్సు కలిగి ఉండాలని, సురక్షిత ప్రయాణానికి, లైసెన్స్ తో పాటు, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. జవహర్ నగర్ ప్రాంతాన్ని ప్రమాద రహిత జవహర్ నగర్ గా తీర్చిదిద్దేందుకు పోలీసులు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. మైనర్లు వాహనం నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని, వారితో పాటు వారి పేరెంట్స్ ను కూడా బాధ్యులుగా చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించి రోడ్డు భద్రతలో భాగస్వాములు కావాలన్నారు. అనంతరం రోడ్డుపై గల గుంతలను పూడ్చితూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఎస్ఐ రాము నాయక్, జిహెచ్ఎంసి అధికారులు సందీప్, నవీన్ గౌడ్, కాలనీవాసులు యాకస్వామి, సరిత, సుప్రియ, తదితరులు పాల్గొన్నారు.




