18 July, 2026 | 4:49 AM

విద్యుత్ శాఖలో ఇంటి దొంగలు!

02-07-2024 06:29 AM
  • ప్యానల్ బోర్డు, మీటర్ల జారీలో మాయాజాలం
  • రీఎస్టిమేట్ లేకుండానే అక్రమంగా మంజూరు 
  • ఆజామాబాద్‌లో విద్యుత్ అధికారుల లీలలు 
  • ఆమ్యామ్యాలు ముడితే అడ్డగోలు అనుమతులు
  • విద్యుత్ శాఖ ఆదాయానికి గండి

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై  (విజయక్రాంతి): విద్యుత్ శాఖ సెంట్రల్ సర్కిల్ పరిధిలో ఆజామాబాద్ డివిజన్ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తు న్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. విద్యుత్ ప్యానల్ బోర్డు మంజూరులో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్ ప్యానల్ బోర్డు, మీటర్ల మంజూరులో పైరవీలు, పైసలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, నేరుగా వెళితే సవాలక్ష కొర్రీలతో వినియోగదారులను అయోమ యానికి గురిచేస్తున్నట్లు బహిరంగంగా చర్చ జరుగుతోంది. ఎలాంటి ఎస్టిమేషన్ లేకుండానే ప్యానల్ బోర్డుకు అదనపు మీటర్లు జారీ చేస్తూ అధికారులు అక్రమ సంపాదనకు తెగబడిపోతున్నారని స్థానికులు మండి పడుతున్నారు. అధికారు ల ఆమ్యామ్యాల పర్వం తో విద్యుత్తు శాఖ ఆదాయానికి పెద్దమొత్తంలో గండి పడుతున్నట్లు తెలుస్తోంది.  

షిఫ్టింగ్ పేరుతో అదనపు మీటర్లు 

హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ ఆజామాబాద్ డివిజన్‌లోని ఓ సెక్షన్ అధికారి ప్యాన ల్ బోర్డుకు ఎలాంటి రీఎస్టిమేట్ లేకుండానే అదనంగా మీటర్లు మంజూరు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి వినియోగదారులు తమ భవనాలకు నిబంధనల ప్రకారం ప్యాన ల్ బోర్డు పొందలేకపోతున్నారు. ఒకవేళ ప్యానల్ బోర్డు పొందినా ఆ తర్వాత అదనపు మీటర్లు కావాలంటే నిబంధనల ప్రకా రం ప్యానల్ బోర్డు అంచనాలను తిరిగి రీఎస్టిమేట్ చేయాలి. ప్రస్తుతం ఉన్న మీటర్ల లోడ్, అదనంగా ఇచ్చే మీటర్ల లోడ్‌ను పరిగణనలోకి ఆ తర్వాత అదనపు మీటర్లు మంజూరు చేయాలి.

నిజానికి ఒక్కో ప్యానల్ బోర్డుకు 18 కిలోవాట్ కెపాసిటీ ఉం టుందని అధికారులు చెబుతున్నారు. అంతకుమించిన కెపాసిటీ ఉన్నట్టయితే సదరు వినియోగదారుడు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ప్యానల్ బోర్డుకు ఉన్న మీటర్ల లోడ్‌కు మించి ఉంటే డీటీఆర్ ఏర్పాటు చేసుకోవాలి. కానీ, ఇక్కడి అధికారులు డీటీఆర్ పెట్టాల్సి వచ్చినా కూడా ప్యా నల్ బోర్డుకు అదనపు మీటర్లను శాంక్షన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. షిఫ్టింగ్ పేరుతో ప్యానల్ బోర్డును మార్చి ఆ తర్వాత ఎలాంటి రీఎస్టిమేట్ లేకుండానే అదే ప్యాన ల్ బోర్డుకు ఎక్స్‌ట్రా మీటర్లు మంజూరు చేస్తున్నారు. 

సర్కారు ఆదాయానికి గండి

ఆజామాబాద్ డివిజన్‌లోని రాంనగర్ సెక్షన్‌లో నిబంధనలకు విరుద్ధంగా ప్యాన ల్ బోర్డుకు ఇటీవల అత్యధికంగా అదనపు మీటర్లు మంజూరు చేసినట్టుగా తెలుస్తోం ది.  అంబర్‌పేట, గోల్నాక, బర్కత్‌పురా సెక్షన్లలోనూ అదే పద్ధతి అవలంబిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. వీరి అక్రమాలు ఒక్క ప్యానల్ బోర్డుకు సంబందించిన మీట ర్లు మాత్రమే కాకుండా, 10 మీటర్ల కంటే ఎత్తులో నిర్మించే భవనాలను కేటగిరీ 8లో చేర్చాల్సి ఉండగా, ముడుపులు పుచ్చుకుని  కేటగిరీ 2లో చేర్చినట్లు సమాచారం. ఈ అక్రమాలలో ఒక్కో కేసుకు ఒక్కో తరహాలో కనీ సం రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు లంచంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ డివిజన్‌లోని అధికారుల వద్ద సామాన్యుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు కూడా బాధితులుగా మారిపోతున్నారంటే ఈ డివిజన్ అధికారుల పనితీరు, విధుల్లో వారికున్న పారదర్శకతను అర్థం చేసుకోవచ్చు. ఓ బాధితుడు ఏకంగా ఎస్‌పిడిసిఎల్ సీఎండికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ తరహా తతంగం నడిపే అధికారుల్లో ఒకరు ఫస్ట్ పోస్టింగ్ చేపడుతున్న అధికారి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. విద్యుత్ శాఖలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై తగు చర్యలు చేపట్టా లని వినియోగదారులు కోరుతున్నారు.