29 July, 2026 | 1:06 AM

భర్త వేధింపులతో గృహణి ఆత్మహత్య

29-07-2026 12:43 AM

కూకట్ పల్లి, జులై 2౮, (విజయక్రాంతి): భర్త, కుటుంబ సభ్యుల వేధింపులతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధి హైదర్ నగర్ లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదర్ నగర్ కు చెందిన శ్రీరాముల కుమారుడైన శ్రీకాంత్ (38)కు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కల్లకల్ గ్రామానికి చెందిన కనిగిరి లలిత కుమార్తె హైమావతి(29)తో 2019 ఫిబ్రవరి 28న పెద్దల సమక్షంలో వివాహం జరిగింది.

వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా తన భర్త శ్రీకాంత్, అత్త,మామ, ఆడపడుచు,ఆడపడుచు భర్త ప్రేరణతో  హైమావతిని వేధింపులకు గురి చేస్తూ తీవ్ర దూషణలు, శారీరకంగా దాడి చేస్తున్నాడంటూ హైమావతి తన తల్లికి తరచూ చెప్తూ ఉండేది. ఈ నేపథ్యంలో ఈనెల 27 రాత్రి శ్రీకాంత్ హైమావతి సోదరుడు గణేష్ కు ఫోన్ చేసి నీ సోదరి ఇక వద్దు తీసుకు వెళ్ళమని చెప్పాడు. తీవ్ర ఆందోళనకు గురైన హైమావతి తనని చంపేస్తారని బెదిరిస్తున్నారని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పింది.

జులై 28 సోమవారం రాత్రి 7. 30 గంటల ప్రాంతంలో శ్రీకాంత్ హైమావతి సోదరుడు గణేష్ కు ఫోన్ చేసి హైమావతి గదిలో తలుపులు వేసుకొని తలుపులు తెరవడం లేదంటూ చెప్పాడు. గణేష్ హుటాహుటినతన  సోదరి ఇంటికి వెళ్లి ఇరుగుపొరుగు వారి సహకారంతో తలుపులు పగలగొట్టి  చూడగా   హైమావతి సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని కనిపించింది. మృతురాలు హైమావతి తల్లి లలిత తన కూతురుని ఆమె భర్త శ్రీకాంత్, అతని కుటుంబ సభ్యుల గృహహింస, వేధింపులతోనే  ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు  ఫిర్యాదు చేశారు. ఈ  మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.