నౌకపై హౌతీల దాడి
ఇద్దరు పాకిస్థానీయులు, ఒక ఇండోనేషియన్ మృతి
సనా/ యెమెన్ / ఇస్తాంబుల్, ఆగస్టు 11: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. దాడులు కొనసాగుతునే ఉన్నాయి. మంగళవారం బాబ్ ఎల్-మండేబ్ జలసంధిలో ఇరాన్ అనుకూల యెమెన్ హౌతీలు సరుకు రవాణా నౌకపై దాడి చేశారు, ఈ దాడిలో ముగ్గురు సిబ్బంది మరణించారు. యెమెన్‌లోని అల్-మోఖా తీరం వద్ద ఒక వాణిజ్య నౌకపై హుతీలు దాడి చేయడంతో ప్రాణనష్టం జరిగిందని తమకు సమాచారం అందిందని ’యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్’ తెలిపింది.
యెమెన్‌లోని పెరిమ్ ద్వీపానికి ఈశాన్యంగా 3.3 నాటికల్ మైళ్ల దూరంలో లంగరు వేసి ఉన్న ఆ నౌకపై హూతీలు దాడి చేసి దానిని దెబ్బతీశారని, ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది మరణించారని బ్రిటీష్ సముద్ర భద్రతా సంస్థ ‘ఆంబ్రీ’ పేర్కొంది. మరణించిన వారు పాకిస్థాన్, ఇండోనేషియా దేశాలకు చెందిన వారిగా భావిస్తున్నారు. ఈ దాడిలో గల్లంతైన వారి వివరాలు కూడా తెలియాల్సి ఉంది.
టాంజానియా జెండా కలిగిన కార్గో నౌక ఒమన్ నుంచి జిబౌటి మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో దాడి జరిగినట్లు భద్రతా సంస్థ అధికారులు పేర్కొన్నారు. అయితే దీనిపై హౌతీలు ఎటువంటి ప్రకటన చేయలేదు. కాగా చమురు రవాణాలో మాండెట్ జలసంధికి చాలా ప్రాముఖ్యత ఉంది.
ఈ జలసంధి యెమెన్, జిబౌటి మధ్య ఉంది. ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానం చేస్తుంది. సూయజ్ కాలువ దిశగా ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా, పశ్చిమాసియా దేశాలకే వెళ్లే నౌకలు, చమురు ట్యాంకర్లకు ఇది ప్రధాన మార్గం. అంతర్జాతీయ వాణిజ్యంలో 10-12 శాతం చమురు దీని ద్వారానే రవాణా అవుతోంది. ఏటా రూ.93.95 లక్షల కోట్ల విలువైన సరకులు ఈ జలసంధి గుండా రవాణా అవుతున్నట్లు అంచనా.






