15 July, 2026 | 3:46 PM

చైర్మన్‌ను ఏ పద్ధతిన నియమించారు?

08-06-2024 01:25 AM

మత్స్యకారుల సహకార సంఘ సమాఖ్య చైర్మన్ నియామకంపై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): ఎన్నికలు నిర్వహించకుండానే మత్స్యకారులు సహకార సంఘాల సమాఖ్య చైర్మన్‌ను నామినేట్ చేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పలు సొసైటీలు ఇచ్చిన వినతి పత్రంపై తీసుకున్న చర్యలను కూడా వివరించాలని కోరింది. ఎక్కువ సంఖ్యలో వారిని కాదని బెస్త వర్గానికి చెందిన వ్యక్తిని చైర్మన్‌గా నియమించడంపై అభ్యంతరాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని బుస్సా మల్లేశం, మరో ౮ మంది దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం శుక్రవారం విచారించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా చైర్మన్‌ను నియమించిందని పిటిషనర్లు వాదించారు. వాదనల తర్వాత హైకోర్టు సంబంధిత శాఖలకు నోటీసులిచ్చింది. పూర్తి వివరాలను వెల్లడించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా నోటీసులు ఇచ్చింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.