15 July, 2026 | 3:55 PM

అజెండాతో రేవంత్ ఢిల్లీకి

08-06-2024 01:15 AM

నేడు సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరు 

కాంగ్రెస్ పెద్దలతో భేటీ కానున్న సీఎం 

క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై చర్చ! 

కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకంపై కసరత్తు 

క్యాబినెట్ రేసులో లెక్కకు మిక్కిలి పేర్లు

లంబాడా, ముదిరాజ్ వర్గాలకు ఖాయమనే చర్చ

త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ

హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): పీసీసీ అధ్యక్షుడు, ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. శనివారం ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి రేవంత్‌రెడ్డితో పాటు సీడబ్ల్యూసీ సభ్యులు, మంత్రి దామోదర రాజనర్సింహ, వంశీచంద్‌రెడ్డి, కాంగెస్ పార్టీ రాష్ట్ర వ్యవహా రాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ హాజరుకానున్నారు.

సార్వత్రిక ఎన్నికలు ముగి యడంతో రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీతోపాటు నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకంపై పార్టీ పెద్దలతో సీఎం చర్చించే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణం స్వీకరించారు. ఇంకా ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. క్యాబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలనే అంశంపై సీఎంకు విచక్షణాధికారం ఉన్నప్పటికి.. పార్టీ నిర్ణయాలు, సూచనల మేరకు నడుచు కోవాల్సి ఉంటుంది.

మంత్రి పదవుల కోసం పదుల సంఖ్యలో పోటీ పడుతున్నారు. దీనిపై ఢిల్లీ పెద్దలతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంద ని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. నామినేటెడ్ పోస్టుల భర్తీ గురించి కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే 37 మందికి కార్పొరేషన్ల చైర్మన్ పదవులిచ్చారు. మరో 17 మందిని వివిధ కార్పొరేషన్లకు త్వరలోనే నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. వీటిపై కూడా అధిష్ఠానం నుంచి అనుమతి పొందనున్నట్టు తెలిసింది. 

క్యాబినెట్‌లో బెర్త్ కోసం తీవ్ర పోటీ 

రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కోసం సీనియర్ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు అవకాశం కల్పించని జిల్లాల నుంచి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌లో నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లేదు. రెండో విడతలో ఈ జిల్లాలకు ప్రాధాన్యం కల్పిస్తారని చెప్తున్నారు. అదే విధంగా బీసీలోని ముదిరాజ్, ఎస్టీల్లోని లంబాడా సామాజికవర్గాలకు చోటు దక్కుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డికి, ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు చోటు దక్కవచ్చనే చర్చ జరుగుతోంది. రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేరు వినిపిస్తోంది. ముదిరాజ్ సామాజికవర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని సీఎం ఎన్నికల సమయంలో ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ఒక్కరే ఉన్నారు. ఆయనకు మంత్రివర్గంలో దాదాపు చోటు ఖాయమని చెప్తున్నారు.

లంబాడా సామాజికవర్గం నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. హైదరాబాద్ జిల్లాలో ఎవరికి ప్రాతినిధ్య కల్పిస్తారనేది ఆసక్తిగా మారింది. గ్రేటర్ పరిధిలో పార్టీ బలహీనంగా ఉందని, బలమైన నాయకుడికి మంత్రి పదవి ఇస్తే.. భవిష్యత్‌లో జరగబోయే గ్రేటర్ ఎన్నికలను సమర్థవంతంగా ఎదర్కోవడానికి అవకాశం ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు. అయితే గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుంచి గత ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలుపొందలేదు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ గెలుపొందారు.

బీఆర్‌ఎస్ నుంచి విజయం సాధించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేయడం వల్లే కాంగ్రెస్ పార్టీ రెండో స్థానానికి చేరిందని, లేదంటే మూడో స్థానంలోనే ఉండేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దానం నాగేందర్‌కు మంత్రివర్గంలో చోటు కల్పిస్తే నగరంలో పార్టీ మరింత బలోపేతం కావడానికి అస్కారం ఉంటుందనే చర్చ జరగు తోంది. కాంగ్రెస్ పార్టీలో మైనార్టీ వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎవరూ లేరు. దీంతో రేవంత్‌రెడ్డి టీమ్‌లో మైనార్టీలకు అవకాశం లేకుండా పోయింది.

ముస్లిం మైనార్టీకి అవకాశం ఇవ్వాలనుకుంటే.. భవిష్యత్‌లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీల్లో ఒకరికి అవకాశం ఇచ్చి మంత్రి వర్గంలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. పాలనపై పూర్తిగా దృష్టి పెట్టాల్సి ఉన్నందున, పీసీసీ పదవి నుంచి రేవంత్‌రెడ్డి తప్పుకునే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోగా కొత్త పీసీసీ చీఫ్ వస్తారని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. కాగా, పీసీసీ పదవి విషయంలో జగ్గారెడ్డి పార్టీ నేత రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్‌ను కోరినట్టుగా  తెలిసింది.

నామినేటెడ్ పదవులపై ఫోకస్

లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగియడంతో కాంగ్రెస్ పార్టీలో నామినెటెడ్ పదవుల సందడి మొదలైంది. ఇప్పటికే 37 వరకు నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన ప్రభుత్వం, ఈ నెల రెండు లేదా మూడో వారంలో మరో 17 వరకు భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఈ పదవుల కోసం వేల మంది తమ వివరాల చిట్టా పట్టుకొని గాంధీభవన్‌కు, మంత్రులు, పార్టీ పెద్దల చుట్టు ప్రదక్షిణ చేస్తున్నారు.

అయితే పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసినవారికి, ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఆశించినా దక్కనివారికి ప్రాధాన్యం కల్పించాలని సీఎం భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన నాయకులకు ఇప్పట్లో ఎలాంటి పదవులు ఇవ్వకూడదని స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు వందవరకు నామినేటెడ్ చైర్మన్ పదవులు ఉంటాయి. ఇప్పటివరకు 50 లోపే భర్తీ చేశారు. మిగిలిన వాటిలో అన్ని వర్గాలకు సముచిత స్థానం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. 

పార్టీ కోసం కష్టపడిన వారికే అవకాశాలు 

 రెండో దఫాలో నియమించేవారిలో తెలంగాణ ఉద్యమకారులు, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం కష్టపడిన వారికి అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం. టీవీ చర్చల్లో పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించడం, ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా కౌంటర్లు ఇస్తున్న వారిలో పార్టీ నేతలు అద్దంకి దయాకర్, భవానిరెడ్డి, చరణ్‌కౌషిక్ యాదవ్, పున్నా కౌలాష్ నేత, చారుకొండ వెంకటేశ్ తదితరులతో పాటు జిల్లా స్థాయిలో, గాంధీభవన్‌లో పారటీ కోసం పూర్తిగా అంకితమై పనిచేసే వారిని కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. మొదటి విడతలో సామాజిక న్యాయం పాటించకపోవటంతో విమర్శలు వచ్చాయని, ఇప్పుడు సామాజిక న్యాయం పాటిస్తూనే విద్యార్హతలను కూడా పరిగణనలోకి తీసుకుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. 

ఆ 37 మంది ఒకటి రెండు రోజుల్లో బాధ్యతలు 

గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కనివారి కి అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవులు ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారు. అందులో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నలుగురు ప్రభుత్వ సలహాదారులు, టీ శాట్, ఫైనాన్స్ కమిషన్, ప్లానింగ్ బోర్డుతోపాటు మరో 37 మందికి నామినేటె డ్ పదవులు ఇచ్చారు. కానీ, అప్పుడే లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వారు బాధ్యతలు స్వీకరించలేదు. గురువారంతో ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు పాలన వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఎన్నికల ముందు నియమించబడిన 37 మంది చైర్మన్లు ఒకటిరెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

ఎమ్మెల్యే స్థాయి నేతలకు కీలక పదవులు 

కొన్ని కీలక నామినేటెడ్ పదవులను ఎమ్మెల్యే స్థాయి నాయకులకు ఇవ్వాలనే యోచనలో సీఎం ఉన్నట్లు సమాచారం. అందుకు రెండు లేదా మూడు కమిషన్లను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. విద్యా కమిషన్, ఉన్నత విద్యా కమిషన్‌తోపాటు వ్యవసాయ కమిషన్లు ఏర్పాటు చేయాలని, వాటికి విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, అల్తాఫ్ జానయ్య, కోదండరెడ్డికి అవకాశం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. మూసీనది అభివృద్ధి కార్పొరేషన్, ఆర్టీసీ కార్పొరేషన్, పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ పదవులు ఎమ్మెల్యే స్థాయి నాయకులకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. విశ్యవిద్యాలయాలకు రెగ్యులర్ వీసీల నియామకంపై ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.