20 August, 2026 | 3:15 AM

పీఎం కేర్ ఎంత?

20-08-2026 12:00 AM

ప్రధానమంత్రి సహాయనిధి జమాఖర్చులను కేంద్రప్రభుత్వం ఎట్టకేలకు బహిర్గతం చేసింది. అయితే, అత్యవసర సమయాల్లో, ఆపత్కాలంలో వినియోగించాల్సిన పీఎం కేర్ ఫండ్‌లో సుమారు రూ.8,452 కోట్ల నిధులు ఉన్నప్పటికీ, 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.87 లక్షలు మాత్రమే ఖర్చు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రజలు అందించిన విరాళాలు ఇంత పెద్ద మొత్తంలో ఉన్నప్పటికీ, ఎందుకు వినియోగించడం లేదన్న ప్రశ్నలు సహజంగానే వెల్లువెత్తుతున్నాయి.

వాస్తవానికి కరోనా మహమ్మారి దేశాన్ని కుదిపేసిన సమయంలో ప్రజలను ఆదుకునేందుకు పీఎం కేర్ ఫండ్ పేరిట ఈ అత్యవసర నిధిని ఏర్పాటు చేసిన విషయం విదితమే. నాడు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పీఎం కేర్ ఫండ్‌కు విరాళాలు అందించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు తమ వంతుగా ఒక రోజు వేతనాన్ని సమకూర్చారు. కొవిడ్ విలయతాండవం చేసిన ఆ రోజుల్లో ఇది ఎందరో అభాగ్యులను ఆదుకున్నది. కానీ, ఆ తర్వాత ఈ నిధి వ్యయానికి సంబంధించి పారదర్శకత లోపించిందన్న ఆరోపణలు వచ్చాయి.

పీఎం కేర్ ఫండ్ సమాచార హక్కు చట్టం కిందికి రాదని, ఇది ప్రజానిధి కాదని ప్రధాని కార్యాలయం చెప్పడం, ఆడిట్ లెక్కలను బయటపెట్టకపోవడమే అందుకు ప్రధాన కారణం. కాగా, గత కొంతకాలంగా పాలకుల నుంచి యువత జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తుండటంతో పీఎం కేర్ ఫండ్ అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ నిధి లెక్కాపత్రాలను కేంద్రం విడుదల చేయక తప్పలేదు. ప్రజల విరాళాలతో ఏర్పడిన నిధి కావడం వల్ల జవాబుదారీతనాన్ని ఆశించడంలో తప్పేమీ లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఈ నిధులను ఎంతమేరకు వినియోగిస్తున్నారు? ఏ వర్గాలకు ఎంత కేటాయిస్తున్నారు? కేటాయింపుల్లో ఎంతమేరకు ఖర్చు చేస్తున్నారు?

ఏటా జమవుతున్న విరాళాలు ఎంత? అనే వివరాలను చెప్పాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వానిదే. కాగా, సువిశాల భారతదేశంలో నిత్యం ఎక్కడో ఒకచోట విపత్తులు సంభవిస్తూనే ఉంటాయి. దేశ భవిష్యత్తును నిర్మించే పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత కూడా కలవరపెడుతున్నది. పాఠశాలల బాగుకోసం వీటిని వాడాలన్న సూచనలూ వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖజానాలో మూలుగుతున్న నిధులను ఏదో ఒక రూపంలో ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ప్రజావసరాల కోసం వీటిని వినియోగిస్తూనే, ప్రతీ పైసాకు లెక్క చెప్పాలి.