15 July, 2026 | 10:36 AM

వరి ఉత్పత్తిలో తెలంగాణదే అగ్రస్థానం

08-06-2024 02:04 AM

ఏటా రాష్ట్రంలో 1.2 కోట్ల ఎకరాల్లో పండిస్తాం

అనుకూల పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తాం

మన పంటలకు ప్రపంచంలో డిమాండ్: మంత్రి తుమ్మల

మాది రైతు అనుకూల ప్రభుత్వం: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఉద్ఘాటించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.2 కోట్ల ఎకరాల్లో ధాన్యం పండిస్తున్నారని, ఆహార భద్రతకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని పేర్కొనారు.

హోటల్ తాజ్‌కృష్ణ వేదికగా ఇంటర్నేషనల్ కమోడిటీ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా శుక్రవారం నిర్వహిస్తున్న ప్రపంచ వరి సదస్సును మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ జీ చిన్నారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని, ఇటీవలే దశాబ్ది ఉత్సవాలు నిర్వహించామని తెలిపారు. రాష్ట్రంలో వరి సదస్సు నిర్వహించడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ఏడాది నుంచి రైతులకు వరి బోనస్ రూ.500 ఇస్తామని, అనుకూలమైన పంటలు వేసేందుకు అన్నదాతలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతామని వెల్లడించారు. 

మనదేశం నుంచి వివిధ రకాల వరిధాన్యం సుమారు 100 దేశాలకు ఎగుమతి అవుతుందని తెలిపారు. ఆఫ్రికా దేశాలు, లాటిన్ అమెరికాలోని కొన్ని దేశాలు, యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు సైతం వరి దిగుమతుల కోసం భారత్‌పై ఆధారపడ్డాయ న్నారు. ఈ అవకాశాలను మనం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే మన రైతులకు గిట్టుబాటు ధరతో పాటు పెద్ద మొత్తంలో ఉన్న మార్కెట్ నిల్వల సమస్య పరిష్కరించుకోవచ్చన్నారు. తెలంగాణ లాం టి వరి మిగులు రాష్ట్రాలకు ధాన్యాన్ని ఎగుమతి చేసే అవకాశాలు చాలా ఉన్నాయని తెలిపారు.

మన రాష్ట్రం నుండి సోనామసూరి, సాంబమసూరి, హెచ్‌ఎంటీ, 1010 బాయిల్డ్, ఐఆర్ 64 రకాలు పండిస్తున్నట్లు తెలిపారు. ఫిలిప్పీన్స్, అమెరికా, బంగ్లాదేశ్, యూఏఈ, యూకే దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు వెల్లడించారు. అదే విధంగా బాస్మతి బియ్యాన్ని పలు దేశాలకు స్పల్ప పరిమాణంలో ఎగుమతి చేస్తున్నట్లు వెల్లడించారు. అంత ర్జాతీయ కామోడిటీ సంస్థ ఏటా ఒక్కొక్క దేశంలో ప్రపంచ వరి సదస్సును గత 22 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ, వరికి సంబంధించిన ఎగుమతి, దిగుమతిదారులతో పాటు శాస్త్రవేత్తలను ఒకే వేదికపై తీసుకువచ్చి పంట అభివృద్దికి కావాల్సిన విధానాలు తీసుకరావడం అభినందనీయమన్నారు. ఈ సదస్సుకు భారత్ సహా 30 దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, రైస్ మిల్లర్లు, శాస్త్రవేత్తలు 250 మంది పాల్గొన్నారు. 

పంటకు మద్దతు కల్పిస్తాం: ఉత్తమ్

తమది రైతు అనుకూల ప్రభుత్వమని, వ్యవసాయరంగానికి అన్ని రకాలుగా మద్ద తు ఇస్తుందని, ధాన్యం కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేస్తుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. వివిధ పథకాల కింద పోర్టిఫైడ్ రైస్ సరఫరా చేస్తున్నామని, రాష్ట్రంలో 3 వేలకుపైగా అత్యాధునిక రైస్ మిల్లులు ఉన్నాయ ని, వీటిలో ఆల్ట్రా మోడరన్ మిల్లులు కూ డా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పండిస్తున్న వరి ఉత్పత్తి థాయిలాండ్‌తో సమానమన్నారు. భవిష్యత్తులో రైతులకు ప్రోత్సాహ కాలు ఇచ్చి పెద్ద మొత్తంలో సాగు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అదే విధంగా మార్కెటింగ్ రంగంలో వచ్చే నూతన మార్పులు, సాంకేతికత ఉపయోగించే విధంగా ప్రయత్నాలు చేస్తామ న్నారు. తెలంగాణలో వరి సదస్సు నిర్వహించడం నిర్వహించడం ఎంతో సంతో షంగా ఉందన్నారు. అనంతరం ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రంలో రైస్ సమ్మిట్ నిర్వహించుకోవడం ప్రపంచ దేశాలకు మన విలువ ఏమిటో తెలిసిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిషనర్ రఘనందన్‌రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్, కమోడిటీ అధ్యక్షుడు జెరెమీ జ్వింజర్, సమరెందు మహంతి తదితరులు పాల్గొన్నారు.