14 July, 2026 | 6:58 PM

Breaking News

ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •  

గుట్కా ఆగేదెట్టా!

09-06-2024 02:18 AM
  • పొరుగు రాష్ట్రాల నుంచి సరఫరా
  • చేతులు మారుతున్న కోట్ల రూపాయలు
  • నిఘా పెడితేనే అడ్డుకట్ట

మెదక్, జూన్ 8 (విజయక్రాంతి): ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న గుట్కా మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. గుట్కా, పాన్ మసాలతో యువత క్యాన్సర్ భారిన పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కట్టడికి చర్యలు మొదలు పెట్టింది. అయితే గుట్కా దందాలో రాటుదేలిన కొందరు గత కొన్నేళ్ళుగా ఉమ్మడి మెదక్ జిల్లాకు పొరుగునే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున తీసుకువచ్చి దందా సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నా యి. అంతేగాకుండా మెదక్ జిల్లాలో ఈ దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున అక్రమంగా గుట్కా, గంజాయి దందా పోలీసుల అండదండలతోనే కొనసాగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ దందాలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు సమాచారం. దశాబ్ధాల కాలంగా గుట్కా దందాలో అడ్డగోలుగా సంపాదించిన వారున్నారు. అలాంటి వారు దందాను అంత సులువుగా వదిలేసే అవకాశం లేదు. వారిని కట్టడి చేయాలంటే గట్టి నిఘా ఉండాల్సిందే. మెదక్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు గుట్కా పెద్ద ఎత్తున సరఫరా అవుతోంది. 

బానిసలుగా మారిన యువత..

కొందరికి పొద్దున లేచింది మొదలుకొని పడుకునేదాకా నోట్లో గుట్కా ఉండాల్సిందే. ముఖ్యంగా యువత గుట్కా కు అలవాటు పడుతున్నారు. గుట్కా లేకుంటే జీవించలేమనేంతగా తయారవుతున్నారు. గుట్కాకు బానిసలైన వారు దానికోసం ఎంతైనా ఖర్చు చేస్తుంటారు. చాలామంది గుట్కా తినడం మూలంగా నోటి క్యాన్సర్ భారిన పడుతున్నారు. అయినా మానివేయలేక పోతున్నారు. ప్రభుత్వం గుట్కాను పూర్తి స్థాయిలో నిషేధించడంతో వారిలో అలజడి మొదలైంది. అయితే డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తే దొరుకుతాయన్న భరోసాతో ఉన్నారు. గుట్కాతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడంతో పాటు దరలవాట్లను మానిపించేందుకు డీ అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. 

నిరంతర నిఘా అవసరం..

పొరుగు రాష్ట్రాల నుంచి వివిధ మార్గాల ద్వారా జిల్లాకు గుట్కా, పాన్ మసాలాలను తీసుకువచ్చేందుకు అవకాశం ఉంది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతం నారాయణఖేడ్, జహీరాబాద్ నుండి మెదక్ జిల్లాకు రాకపోకలు ఉన్నాయి. గుట్కా, పాన్ మసాలాలు ఆయా ప్రాంతాల నుంచి జిల్లాకు సులువుగా సరఫరా అవుతాయి. ప్రధానంగా నారాయణఖేడ్, పెద్దశంకరంపేట మీదుగా టేక్మాల్, బొడ్మట్‌పల్లి తదితర ప్రాంతాల ద్వారా అక్రమంగా గుట్కా దందా గుట్టుచప్పుడు కాకుండా రవాణా అవుతుంది. గతంలో గుట్కా ముఠా టేక్మాల్, బొడ్మట్‌పల్లి ప్రాంతంలో దొరికినప్పుడు భారీ ఎత్తున గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నాగ్‌పూర్ జాతీయ రహదారిపై తూప్రాన్ వద్ద పలుమార్లు గుట్కా తరలిస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. అయితే ప్రధాన చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా పెంచితేనే గుట్కా దందాను కట్టడి చేయవచ్చు.