calender_icon.png 1 February, 2026 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టన్నెల్‌కు.. పైసలెట్లా..!

01-02-2026 02:34:44 AM

నిధుల సమీకరణపై మంత్రి ఉత్తమ్ తీవ్ర కసరత్తు

  1. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌పై నేతల తలోమాట
  2. కొత్త ప్రాజెక్టులకంటే ముందుగా.. పాత ప్రాజెక్టులను పూర్తిచేసేలా బడ్జెట్ కేటాయింపులు అత్యవసరం

హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ) ప్రస్తుతం ప్రజల్లో తీవ్ర చర్చను రేకెత్తిస్తోంది. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు.. ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు జీవనాడిగా చెప్పుకునే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) ఎప్పటిలోగా పూర్తవుతుందనే చర్చతోపాటు.. ఈ ప్రాజెక్టు పూర్తవడానికి నిధులు ఎలా అనే ఆలోచనలు చుట్టుముడుతున్నాయి.

అయితే ఎలాగైనా నిర్దేశించుకున్న గడవులోగా ఎస్‌ఎల్‌బీసీని పూర్తిచేసి, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో వెలుగులు తీసుకురావాలనే ఆలోచనలతో నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర కసరత్తు చేస్తుండటం కొంతలో కొంత సంతోషకరం.

మంత్రి కసరత్తు..

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ నల్లగొండ జీవధార అయిన ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో  సాగుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే నిధుల కేటాయింపుపై కసరత్తు చేస్తున్నారు. నిర్దేశించుకున్న గడువులోగా దీనిని ఎలాగైనా పూర్తిచేయా లని కణం కట్టుకున్నారు. అయితే..ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలంటే ఆర్థిక  క్రమశిక్షణ  అవసరమని రాజకీయ, ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 

ప్రజావసరాలను గుర్తించి.. అందుకు అనుగుణంగా కేటా యింపులు ఉండాలని.. పైగా ఎప్పటిలోగా పూర్తిచేయాలనేదికూడా ముఖ్యమని వారంటున్నా రు. ఈ నేపథ్యంలో కొత్త ప్రాజెక్టులను చేపట్టడం, వాటికి భారీగా నిధులు కేటాయించడం కంటే.. నిర్మాణం మధ్యలో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసేలా నిధుల కేటాయింపు ఉండాలనేది ఇక్కడ కీలకమని చెప్పవచ్చు. ఆర్థిక ప్రణాళికతోపాటు.. బడ్జెట్‌లో సరైన కేటాయింపులు ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

నీటిపారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్  ఈ అంశాలపై కసరత్తు చేస్తున్నారు. పనులు చేసే కాంట్రాక్టరు, బడ్జెట్ కేటాయింపులను పరిశీలిస్తూ.. గడువులోగా ఎస్‌ఎల్‌బీసీని పూర్తిచేయడంపై మంత్రి శ్రమిస్తున్నారు. రాబోయే బడ్జెట్‌లో దీనికి సంబంధించి నిధుల కేటాయింపు కీలకాంశంగా చెప్పవచ్చు. ఆ దిశగా కసరత్తు మొదలయ్యింది. 

15 ఏండ్ల ప్రాజెక్టుపై.. తలోమాట..

వాస్తవానికి ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు ఎప్పుడో 15 ఏండ్ల క్రితం ప్రారంభించారు. ఒక వినూత్న యంత్రంతో ఈ ప్రాజెక్టును చేపట్టినప్పుడు అందరిలోనూ ఆశ్చర్యం, ఉత్కంఠ నెలకొన్నాయి. అయితే ప్రాజెక్టు పూర్తవ్వడానికి గడువు పెంచుతున్నకొద్దీ.. ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతూ వస్తోంది. ఎన్నడో పూర్తిచేయాల్సిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను ఒక్కో ప్రభుత్వం ఒక్కో విధంగా ముందుకు తీసుకెళ్లడాన్ని మనం గమనించవచ్చు.

మధ్యలో సాంకేతిక సమస్యలు, నిధుల కొరత, పాలకుల నిర్లక్ష్యం, ఇంజనీర్ల వైఫలం.. ఇలా ఎన్నో కారణాల వల్ల ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో జలధారులు కురిపించే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టు గడిచిన 15 ఏండ్లుగా నత్త నడకన సాగుతూ వస్తున్నది. ఎట్టకేలకు ఈ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పడం కొంత ఉత్సాహాన్ని కల్పిస్తున్నప్పటికీ.. గడవుపై తలోమాట చెప్పడం మాత్రం మరోసారి నిరాశకు గురిచేస్తోంది.

ఎస్‌ఎల్‌బీసీని 2026లోగా సిద్ధం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పగా.. 2027 లోగా పూర్తిచేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పడం గమనార్హం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరో అడుగు ముందుకు వేసి.. రాబోయే ఎన్నికల (2029)లోగా ఎస్‌ఎల్‌బీసీని పూర్తిచేస్తామని చెప్పడంతో.. గడువుపై మరోసారి నీలినీడలు కమ్ముకునే పరిస్థితి కనపడుతోంది.

నిధుల మాటేమిటి..

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఎస్‌ఎల్‌బీసీ పూర్తవడా నికి ముఖ్యమైనవి నిధులే.  తగినట్టుగా బడ్జెట్ కేటాయింపులు ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎస్‌ఎల్‌బీసీ విషయంలో మరికొన్ని సాంకేతిక అంశా లను పరిశీలించాల్సి ఉంది. ఇతర ప్రాజెక్టుల కన్నా విభిన్నమైన భౌగోళిక పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును చేపట్టారు. నిజానికి ఎప్పటి వరకు ఇది పూర్తవుతుందనే అంశంపై ఒక స్పష్టత అవసరం. అప్పుడే అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులపై దృష్టి సారంచవచ్చు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టరు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఎందుకంటే.. ప్రస్తుత కాంట్రాక్టు సంస్థలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా నేషనల్ కంపెనీ లా  ట్రిబ్యునల్ (ఎన్ సీఎల్‌టీ) పరిధిలోకి వెళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత కాంట్రాక్టరే ఈ పనులను చేయగలరా.. లేక కొత్త కాంట్రాక్టు సంస్థతో ముందుకు సాగుతారా అనే విషయంలో స్ప ష్టత అవసరం. దాదాపు 15 ఏండ్ల క్రితం ప్రా రంభించిన ప్రాజెక్టుకు మొదటి నుంచి భౌగోళిక పరిస్థితులు, నిధుల కేటాయింపు, అసమర్థ నిర్మాణ సంస్థ లాంటి అంశాలే అడ్డంకులుగా చెప్పవచ్చు.