01-02-2026 02:37:15 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 31 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టి స్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణకు రావాలంటూ సిట్ అధికారులు రెండోసారి జారీచేసిన నోటీసులపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో స్పందించారు. తనకు నోటీసులు జారీ చేసిన వి ధానం చట్టవిరుద్ధంగా ఉందంటూ మండిపడ్డారు.
ఈ మేరకు శనివారం జూబ్లీహిల్స్ ఏసీపీకి ఆయన ఒక ఘాటు లేఖ రాశారు. మాజీ ముఖ్యమంత్రినైన తనకు చట్టప్రకారం నోటీసులు ఇవ్వ లేదని, ఇంటి గోడకు వాటిని అతికించడం తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించడమేనని ఆవేదన వ్యక్తంచేశారు.
పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేసినప్పటికీ, బాధ్యతాయుతమైన పౌ రుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్ స్పష్టంచేశారు. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని తన నందినగర్ నివాసంలో విచారణకు అం దుబాటులో ఉంటానని, సిట్ అధికారులు అక్కడికి రావచ్చని ఆయన ఆ లేఖలో వెల్లడించారు.
గోడకు అంటించడమేంటి..
నోటీసుల జారీ విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని కేసీఆర్ లేఖ లో తప్పుబట్టారు. ‘నాకు నేరుగా నోటీసులు ఇవ్వకుండా, నందినగర్ నివాసం గోడపై అతికించడం ఏంటి?.. ఇది సరైన పద్ధతి కాదు. ఈ చర్య నా ప్రతిష్టను దిగజార్చేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఉంది’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసుల తీరు కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని ఆయన హెచ్చరించారు.
అక్రమ పద్ధతిలో ఇచ్చిన ఈ నోటీసులను తాను న్యాయపరంగా విస్మరించే అవకాశం ఉన్నప్పటికీ, చట్టం పట్ల గౌరవంతో ఆ పని చేయడంలేదని పేర్కొన్నారు. చట్టప్రకారం 65 ఏళ్లు పైబడిన వారిని, వారు నివసిస్తున్న చోటనే విచారించాల్సి ఉంటుందని కేసీఆర్ పోలీసులకు గుర్తుచేశారు. పార్లమెంట్ చేసిన చట్టాన్ని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సిట్ అధికారులు ఉల్లంఘించారని ఆరోపించారు.
తాను ప్రస్తుతం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో నివసిస్తున్నానని, చట్ట ప్రకారం అక్కడే విచారణ జరపాలని స్పష్టం చేశారు. తాను ఎర్రవల్లిలో ఉంటుండగా, జూబ్లీహిల్స్ ఏసీపీకి తనను విచారించే అధికార పరిధి ఎక్కడిదని ప్రశ్నించారు. ఎన్నికల అఫిడవిట్‌లోని చిరునామాకు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 160 కింద ఇచ్చే నోటీసులకు సంబంధంలేదని తేల్చిచెప్పారు.
హరీష్ కో న్యాయం.. నాకో న్యాయమా..
పోలీసుల తీరుపై కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. మాజీ మంత్రి హరీష్‌రావు నోటీసుల విషయంలో ఒకలా, తన విషయంలో మరోలా వ్యవహరిస్తూ పోలీసులు డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నారని విమర్శించారు. సిద్దిపేట చిరునామాతో ఉన్న హరీశ్‌రావును హైదరాబాద్‌లో విచారించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. నోటీసుల జారీలో సుప్రీంకోర్టు నిబంధనలను బేఖాతరు చేశారని, ఇందుకు సంబంధించి ఏపీ హైకోర్టు వెలువరించిన వీడీ మూర్తి కేసు తీర్పును కూడా కేసీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం నివసిస్తున్న చోటే విచారణ జరపాలని పార్లమెంట్ చట్టం చెబుతున్నా, పోలీసులు దానిని పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
భవిష్యత్తులో నోటీసులన్నీ ఎర్రవల్లికే..
నందినగర్‌లో విచారణకు అంగీకరించినప్పటికీ, భవిష్యత్తులో తనకు పంపే ఏ నోటీసైనా ఎర్రవల్లి చిరునామాకే పంపాలని కేసీఆర్ పోలీసులకు సూచించారు. ఇకపై వచ్చే నోటీసుల విషయంలో చట్టపరమైన నిబంధనలు కచ్చితంగా పాటించాలని సిట్ అధికారులకు ఆయన హితవు పలికారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు కేసీఆర్ సిద్ధమవడంతో, బీఆర్‌ఎస్ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఆదోళనలకు సమాయ త్తమౌతున్నది.