calender_icon.png 1 February, 2026 | 10:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గళమెత్తిన టీచర్లు

01-02-2026 02:31:23 AM

  1. ఫిబ్రవరి 5న చలో ఢిల్లీ!
  2. ఏఐజాక్టో ఆధ్వర్యంలో పార్లమెంట్ మార్చ్ 
  3. తొలుత దేశవ్యాప్తంగా ఉమ్మడి సమస్యలపై పోరు 
  4. తర్వాత.. ఏళ్ల తరబడి రాష్ట్రంలోని అపరిష్కృత సమస్యలపై సమరం 
  5. ఫిబ్రవరి 10 తర్వాత జేఏసీ ఏర్పాటు

ప్రధాన డిమాండ్లు ఇవీ.. 

* ఇన్‌సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

* ఎన్‌పీఎస్/యూపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలుచేయాలి

* నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఈపీ)-2020ను ఉపసంహరించుకోవాలి

* ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు కూడా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును కల్పించాలి. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లే పోటీచేయాలి

* పాఠశాలల విలీనాన్ని, బడుల మూసివేతను నిలిపివేయాలి

* బోధనేతర పనులను ఉపాధ్యాయులతో చేయించొద్దు

* విద్యాశాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేసి, కనీస వేతనం అమలుచేయాలి

హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): ఏండ్ల తరబడిగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలను పరిష్కరిం చాలన్న ప్రధాన డిమాండ్‌తో దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలన్నీ పోరుబాటకు సిద్ధమయ్యాయి. దేశ్యాప్తంగా ఉన్న ఎస్‌టీఎఫ్‌ఐ, ఏఐఎస్‌టీఎఫ్, ఏఐపీటీఎఫ్, ఏఐఎఫ్‌ఈటీవో, ఏఐఎఫ్‌టీవో, ఏఐఎఫ్‌ఆర్‌టీఈ, ఏఐఎస్‌ఈసీ, ఏఐఐటీఏ తదితర ఉపాధ్యాయ సంఘాలు ఏకమై ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్(ఏఐజాక్టో)గా ఏర్పాటై కేంద్రంపై ఒత్తిడి తేనున్నాయి.

ఏఐజాక్టోలో భాగమైఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి 35 ఉపాధ్యాయ సం ఘాలు కూడా ఈనెల 5న చేపట్టే చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా ఉన్న ఉమ్మడి సమస్యలను పరి ష్కరించాలని డిమాండ్‌చేస్తూ తొలుత ఈనెల 5న ఢిల్లీలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టి.. ఫిబ్రవరి 10 తర్వాత రాష్ట్రంలోని ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పాటై ఉద్యమం చేపట్టబోతున్నాయి. త్వరలోనే ఈ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నాయి. అటు కేం ద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై ఐక్యఉద్యమంతో ఒత్తిడితీసుకొచ్చి తమ డిమాండ్‌లను సాధించుకునేలా పూర్తి కార్యాచరణను టీచర్ సంఘాలు చేపట్టనున్నాయి. 

కేసీఆర్ హయాం నుంచే..

గత కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఉపాధ్యాయ సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆ ప్రభుత్వం రేపు మాపు అంటూ దాటవేస్తూ వచ్చిం ది. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను రోజులు, నెలల్లోనే పరిష్కరిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమ సమస్యలను పరిష్కరిస్తుంది కాదా అని ఉపాధ్యాయ సంఘాలు భావించాయి. 

అయిన రెండెళ్లు పూర్తియినా.. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్న తులు, మొదటి తేదీన వేతనాలు మినహా, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలుపర్చడంలో తాత్సారం చేస్తోందని సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. అప్పుడొకటి ఇప్పుడొకటి రెండు డీఏలు ప్రకటించారు. ఇంకా నాలుగు డీఏలు పెండింగ్‌లోనే ఉన్నాయి. జనవరి నుంచి మరో డీఏ చేరడంతో మొత్తం ఐదు డీఏలు పేరు కుపోయాయి. 

 పీఆర్సీ ఊసే లేదు..

ఇక ముప్పు నెలలు గడుస్తున్నా పీఆర్సీ ఊసే లేదు. పీఆర్సీ అమలుచేయడం దేవుడెరుగు.. సిద్ధంగా ఉన్న పీఆర్సీ నివేదికను తీసుకునేందుకే ఈ ప్రభుత్వం  సిద్ధంగా లేదు. ప్రభుత్వం తీసుకుంటే.. ఇచ్చేందుకు పీఆర్సీ కమిటీ తన నివేదికను సిద్ధంగాచేసి ఉంచింది. దీన్ని అమలుచేయాలంటే ప్రభుత్వంపై అదనపు భారం ఎక్కడ పడుతుం దోనని.. తీసుకునేందుకు వెనుకడుగు వేస్తోందనే విమర్శలున్నాయి.

వెంటనే నివేదిక తెప్పించుకుని టీచర్ సంఘాలతో చర్చించి మంచి ఫిట్‌మెంట్‌తో దానికి 01 2023 నుంచి అమలుచేయాలని ఉపాధ్యా య సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈహెచ్‌ఎస్ స్కీం అమలుకు గత కేసీఆర్ ప్రభుత్వంలోనే జీవో నెంబర్ 186ను జారీచేసి ట్రస్టు బోర్డును కూడా ఏర్పాటుచేశారు. ఉద్యోగులు, సర్కా రు వాటాను ఖరారుచేసి ఈ పథకాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయడమే మిగిలి ఉంది.

15 రోజుల్లో డీఏలు, నెలరోజుల్లో పెండింగ్ బిల్లులు, ఆరు నెలల్లో పీఆర్సీ, హెల్త్ కార్డులిస్తామని, సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ను అమలుచేస్తామని ఎన్నికలప్పుడు కాంగ్రెస్ హామీలిచ్చి విస్మరించిం దని ఆరోపణలున్నాయి. పెండింగ్ బిల్లులు మాత్రం నెలకు రూ.700 కోట్ల చొప్పున మూడునాలుగు దఫాలుగా మాత్రం ప్రభు త్వం విడుదల చేస్తోంది.

ఉద్యోగుల పెండింగ్ బిల్లులను మాత్రమే ప్రభుత్వం విడుదల చేస్తున్నదని, పెన్షనర్లకు రావాల్సిన రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌ను మాత్రం విడుదల చేయ డంలేదని బాధిత రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 317 జీవోతో బాధిత ఉ పాధ్యాయుల సమస్య పూర్తిగా సమసిపోలేదు.

పర్యవేక్షణేలేదు..

జిల్లాల్లో పర్యవేక్షణ అధికారులే కరువయ్యారు. కొత్త జిల్లాలు, మండలాలకు డీఈవోలు, డిప్యూటీ ఈవో లు, ఎంఈవో పోస్టులే మంజూరుకాలేదు. ఈ పోస్టులు మంజూరుచేసి తర్వాత వీటిని భర్తీ చేయాల్సి ఉం టుంది. కొత్తగా ఏర్పడిన జిల్లాలు, మండలాలకు ఇతర శాఖలకు సంబంధించిన పోస్టులు మంజూరయ్యాయి. కానీ విద్యాశాఖలో మాత్రమే ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ముగ్గురు.. నలుగురు మినహా రెగ్యులర్ డీఈవోలు లేరు.

అంతా ఇన్‌ఛార్జీలే ఉన్నారు. హైదరాబాద్ మినహా ఎక్కడ కూడా డిప్యూటీ ఈవోలు లేరు. ఎంఈవోలు 12 మందే రెగ్యులర్ ఉన్నారు. మిగతా మండలాల్లో ఇన్‌చార్జులే పనిచేస్తున్నారు. అసలు పోస్టులే మంజూరు చేయలేదు. డీఈవో, ఎంఈవో పోస్టులను మంజూరు చేయాల్సిఉంది. 

కేంద్రం అప్పీలు లేదా చట్టం చేయాలి

రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలతోపాటు దేశంలోని ప్రధాన ఏడు సంఘాలు ఏకమై ఢిల్లీలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. పరీక్ష ద్వారా టీచర్ ఉద్యోగానికి ఎంపికైన మాకు మళ్లీ టెట్ అర్హత పరీక్ష పెట్టడమేంటి. అయినా మేం 20, 30 ఏళ్లుగా విధుల్లో ఉన్నాం. ఇప్పుడు టెట్ లేదని ఉద్యోగాల నుంచి తొలగించడమనేది చాలా అన్యాయం.

వెంటనే కేంద్రం దీంట్లో జోక్యం చేసుకుని సుప్రీం ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలి లేదా టీచర్లకు టెట్ నుంచి మినహాయింపునిచ్చేలా పార్లమెంట్‌లో చట్టం చేయాలి. దేశ ప్రధాని దృష్టికి ఈ అంశం వెళ్లేలా టీచర్లు పెద్ద సంఖ్యలో ఫిబ్రవరి 5న ఢిల్లీలో పాల్గొనాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా పీఆర్సీ నివేదికను తెప్పించుకుని మార్చిలోపు దాన్ని అమలు చేయాలి. ఇంకా ఐదు డీఏలు పెండింగ్‌లోనే ఉన్నాయి. వాటిని కూడా ఇవ్వాలి.

 పులగం దామోదర్‌రెడ్డి, 

పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు

బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి

టెట్ నుంచి టీచర్లకు మినహాయింపు ఇవ్వాలి. రానున్న వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి తగిన నిధులు కేటాయించాలి. జూలై 2023 నుంచి పెండింగ్‌లో ఉన్న నూతన వేతన సవరణ కమిషన్ నివేదికను వెంటనే తెప్పించుకోవాలి. గత పీఆర్సీ 18 ఇన్‌స్టాల్‌మెంట్‌లలో ఇప్పటి వరకు కేవలం మూడింటినే చెల్లించారు. ఇంకా 15 పెండింగ్‌లోనే ఉన్నాయి. రాష్ట్రంలో సరిపడా డీఈవో, డిప్యూటీ ఈవో, ఎంఈవో పోస్టులను భర్తీ చేయలేదు. కొత్త జిల్లాలు, మండలాలకు పోస్టులను మంజూరు చేయాలి. 

 కటకం రమేశ్, 

టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు

పెద్ద ఎత్తున తరలిరావాలి

టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వడంతోపాటు, పాత పెన్షన్, పీఆర్సీ, ఈహెచ్‌ఎస్‌ను అమలు చేయాలి. పర్యవేక్షణ అధికారులు, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. ఫిబ్రవరి 5న నిర్వహించే పార్లమెంట్ మార్చ్ కార్యక్రమానికి ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలిరావాలి. ఉపాధ్యాయులందరూ ఆ రోజు ఉదయం 10 గంటలకు జంతర్ మంతర్ వద్దకు చేరుకోవాలి. అక్కడ జరిగే నిరసన కార్యక్రమంలో పలువురు పార్లమెంట్ సభ్యులు, వివిధ జాతీయ సంఘాల నాయకులు కూడా పాల్గొనే అవకాశముంది.

 రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు