31-07-2024 01:17:42 AM
జార్ఖండ్, జూలై 30: జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్ వద్ద హౌరా-సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా 20 మందికి తీవ్ర గాలయ్యాయి. రైల్వే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మిగితా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. జంషడ్‌పూర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బరంబంబూ ప్రాంతంలో తెల్లవారుఝామున నాలుగు గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదంలో రైలులోని 18 బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం నేపథ్యంలో.. ఆ రూట్లో వెళ్లే పలు రైళ్లను రద్దుచేశారు. మరికొన్నిటిని దారిమళ్లించారు. కాగా ఘటనాస్థలికి కొంతదూరంలో మరో గూడ్స్ రైలు కూడా పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే రెండు ప్రమాదాలు ఒకేసారి జరిగాయా.. లేదా అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. విచారణ అనంతరం పూర్తివివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10లక్షలు, క్షతగాత్రులకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి
జార్ఖండ్‌లో జరిగిన రైలు ప్రమాదం నన్ను కలిచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలి యజేస్తున్నా. దేశంలో రైలు ప్రమాదాలు సహజమైపోయాయి. ప్రతీవా రం ఓ రైలు ప్రమాదం చోటుచేసుకుంటోంది. వీటిని ఇంకా ఎంతకాలం సహించాలి. కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ నిర్లక్ష్యం వీడాలి.
మమతా బెనర్జీ,
ముఖ్యమంత్రి, పశ్చిమ బెంగాల్
రైల్వే ప్రమాదాల్లో రికార్డు నెలకొల్పారు
ఎన్డీఏ సర్కార్, భారత రైల్వే.. రైల్వే ప్రమాదాల్లో రికార్డులు నెలకొల్పుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్డీఏ రైల్వే ప్రమాదాలు ఎక్కువైపోయాయి. మొన్నిటివరకు రికార్డు స్థాయిలో పేపర్ లీకులు.. ఇప్పడేమో రైల్వే ప్రమాదాల్లో రికార్డులు.. ఈ రెండూ ఎన్డీఏకే చెందాయి.
అఖిలేష్ యాదవ్, సమాజ్‌వాద్ పార్టీ నేత, యూపీ
రైల్వే మంత్రికాదు.. రీల్ మంత్రి
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రమాదాలను నివారించడం మానేసి పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారు. వాస్తవానికి ఆయన రీల్ మంత్రి. ఎన్డీఏ ప్రభుత్వంలో జవాబుదారీతనం లేదు. ప్రమాదంపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.
ప్రియాంక చతుర్వేది, శివసేన ఎంపీ