31-07-2024 01:00:58 AM
హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): ఏళ్లుగా జాతీయ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పథకంలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహిస్తున్న 17 వేల కు పైగా ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు ఎం నరసింహ డిమాండ్ చేశారు. ప్రజలకు నిత్యం వైద్య సేవలు అందించడంలో తాము ముందున్నా.. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తమకు కనీస వేతనం ఇవ్వడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వా ల తీరుతో తమ కుటుంబాలు వీధిన పడే పరిస్థితి వచ్చిందని వాపోయారు. మంగళవారం కోఠిలోని ఎన్‌హెచ్‌ఎం కమిషనర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు.
వివిధ క్యాడర్ల ద్వారా ఉద్యోగుల్ని ప్రభుత్వం నియమించుకుంటున్నదని, సమాన పనికి సమా న వేతనం ఇవ్వడంలో మాత్రం వైఫల్యం చెందుతోందని నరసింహ విమర్శించారు. రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చే బేసిక్ వేతనాన్ని తమకు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. దీంతో చాలీచాలనీ వేతనాలకు విధులు నిర్వహించాల్సి వస్తోందని చెప్పారు. ప్రభుత్వం, అధికారులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని స్పష్టంచేశారు.
తమకు రావాల్సిన ఏడు నెలల పిఆర్సీ బకాయిలను సైతం నేటికీ విడుదల చేయకపోవడం అన్యాయమని ఆ సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి రమా రాజేశ్‌ఖన్నా వాపోయారు. రాబోయే పీఆర్సీ లోనైనా సమాన పనికి సమాన వేతనం చట్టం ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాం డ్ చేశారు. అనంతరం ఎన్‌హెచ్‌ఎం రాష్ట్ర కార్యదర్శి ఆర్వీ కర్ణన్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆ సంఘం ప్రతిని ధులు బాలసుబ్రమణ్యం, బాపు యాదవ్, నర్సింగ్ ఆఫీసర్స్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షురాలు నిశాంతిని, ఇన్‌సిడి కౌన్సిలర్స యూనియన్ నాయకురాలు జ్యోతి, గోపి తదితరులు పాల్గొన్నారు.