మహిళల ధనాధన్‌కు ఫుల్ క్రేజ్
హాట్ కేకుల్లా టీ20 ప్రపంచకప్ టికెట్లు
లండన్, జూన్ 8: మహిళల క్రికెట్‌కు గతంలో కంటే క్రేజ్ చాలా పెరిగింది. ఐపీఎల్ తరహాలో డబ్ల్యూపీఎల్, మహిళల వన్డే వరల్డ్ కప్, టీ20 ప్రపంచకప్, ఆసియా కప్ వంటి టోర్నీలకు వ్యూయర్‌షిప్ పరంగానూ, స్టేడియాలకు వచ్చి మ్యాచ్‌లు వీక్షించే అభిమానుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తాజాగా ఈ క్రేజ్ మరోసారి రుజువైంది. జూన్ 12 నుంచి మొదలయ్యే ఐసీసీ మహిళల టీ 20 వరల్డ్‌కప్ 2026 ప్రారంభానికి ముందే సుమారు 2 లక్షలు టికెట్లు అమ్ముడయ్యాయి.
ఉమెన్స్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఇదే రికార్డు బుకింగ్. గతంలో ఏ టీ20 వరల్డ్‌కప్‌కు కూడా ఇలాంటి సేల్స్ నమోదవ్వలేదు. మహిళల మ్యాచ్‌లను చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని చెప్పడానికి ఈ టికెట్ల విక్రయమే నిదర్శనం. టోర్నీ ప్రారంభానికి ఇంకో 4 రోజులు ఉండగా 12 జట్ల కెప్టెన్లతో ఐసీసీ ఫొటోషూట్ నిర్వహించింది.
ఈ టోర్నీ ఇంగ్లండ్ వేదికగా జరగనుండటం కూడా అభిమానులను ఆకట్టుకోవడానికి ఒక కారణం. లండన్‌లో జరిగిన కెప్టెన్ల మీట్‌కు అభిమానులు ఎక్కువ మంది రావడంపై ఐసీసీ డైరెక్టర్, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ రిచర్డ్ థామ్సన్ ఆనందం వ్యక్తం చేశారు. మహిళల క్రికెట్ భవిష్యత్తులో ఎలా ముందుకు సాగుతుందో చెప్పడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు.






