9 June, 2026 | 1:07 AM

ఆప్ఘన్‌ను తిప్పేశారు

09-06-2026 12:00 AM

భారత్ ఘనవిజయం

చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్థాన్

ఇన్నింగ్స్ 300 రన్స్‌తో భారత్ గెలుపు

మానవ్ సుతార్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్

ముల్లాన్‌పూర్‌లో భారత స్పిన్నర్లు తిప్పేసారు. తొలుత బ్యాటింగ్‌లో అదరగొట్టి భారీస్కోరు చేసిన టీమిండియా తర్వాత బౌలింగ్‌లోనూ చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో మానవ్ సుతార్, రెండో ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తిప్పేయడంతో ఆప్ఘనిస్థాన్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. పూర్తి ఆధిపత్యం కనబరిచిన భారత్ మూ డు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించేసింది. టెస్ట్ క్రికెట్‌లో భారత్‌కు ఇది అతిపెద్ద విజయం.

ముల్లాన్‌పూర్, జూన్ 8: ఊహించినట్టుగానే భారత్‌తో ఏకైక టెస్టులో ఆప్ఘనిస్థాన్ పెద్దగా పోటీనివ్వలేకపోయింది. 5 వికెట్లకు 113 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడోరోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆప్ఘన్ టీమ్ కాసేపటికే ఆలౌటైంది. రెహమత్ షా(60) ఒక్కడే హాఫ్ సెంచరీతో పోరాడడంతో స్కోర్ కనీసం 150 దాటగలిగింది. మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌటైన ఆప్ఘనిస్థాన్ కు భారత్ తమ వ్యూహానికి తగ్గట్టే ఫాలోఆన్ ఇచ్చింది. 

భారత బౌలర్లలో అరంగేట్రపు బౌలర్ మానవ్ సుతార్ 6 వికెట్లతో అఫ్గాన్ పతనాన్ని శాసించాడు. అతనితో పాటు ప్రసిధ్ కృష్ణ మూడు వికెట్లతో సత్తా చాటా డు. వాషింగ్టన్ సుందర్‌కు ఒక వికెట్ దక్కిం ది. భారత్‌కు 412 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఫాలోఆన్‌లో పడి రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆప్ఘనిస్థాన్ లంచ్ బ్రేక్ వరకూ  వికెట్ కోల్పోకుండా బాగానే ఆ డింది. అయితే లంచ్ తర్వాత భారత స్పిన్న ర్లు చెలరేగిపోయారు. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తమ స్పిన్ మాయాజాలంతో ఆప్ఘన్ బ్యాటర్లను తిప్పేసారు.

ఫలితం గా 42 పరుగుల దగ్గర మొదలైన వికెట్ల పతనం 112 పరుగులకే ముగిసిపోయింది. గాయంతో షరాఫుద్దిన్ అష్రఫ్ బ్యాటింగ్‌కు రాకపోవడంతో 9 వికెట్లకే ఆప్ఘన్ రెండో ఇన్నింగ్స్‌కు తెరపడింది. భారత స్పిన్నర్ల దెబ్బకు ఆప్ఘనిస్థాన్ 14 పరుగుల వ్యవధిలోనే  చివరి 6 వికెట్లు కోల్పోయి ఘోరపరా భవాన్ని మూటగట్టుకుంది.

దీంతో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. తద్వారా టెస్ట్ క్రికెట్‌లో అతిపెద్ద విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో గిల్, రాహుల్ సెంచరీలతో చెలరేగగా భారత్ 564/8 రన్స్‌కు డిక్లేర్ చేసింది.  గిల్(177 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్తో 126), కేఎల్ రాహుల్(165 బంతుల్లో 11 ఫోర్లతో 100) శతకాలు సాధించగా, రిషభ్ పంత్ (121 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 81), వాషింగ్టన్ సుందర్ (68 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు.

రెండో ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ 4 , కుల్దీప్ యాదవ్ 3, సుతార్ 1, సిరాజ్ 1 వికెట్ పడగొట్టారు. మ్యాచ్‌లో మొత్తం 7 వికెట్లు పడగొట్టడంతో పాటు బ్యాట్‌తో 28 పరుగులు చేసిన మానవ్ సుతార్ అరంగేట్రంలోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్‌లో భారీ స్కోర్ చేసిన టీమిండియా.. ఆ తర్వాత తమకు అలవాటైన రీతిలో స్పిన్ ఉచ్చులో బిగించింది. ఈ మ్యాచ్‌లో ఏ దశలోనూ అఫ్గానిస్థాన్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. టెస్ట్ క్రికెట్ అనుభవలేమి ఆ జట్టు కొంపముంచింది. అఫ్గాన్ బ్యాటింగ్ వైఫల్యంతో మూడో రోజు ఆటలో రెండున్నర సెషన్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

చరిత్ర సృష్టించిన మానవ్ సుతార్

టీమిండియా యువ స్పిన్నర్ మానవ్ సుతార్ చరిత్ర సృష్టించాడు. అరంగేట్ర టెస్టులోనే అత్యధిక వికెట్ల ఘనతను అందుకున్న రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. అఫ్గా నిస్థాన్‌పై ఏకైక టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మానవ్ సుతార్(6/33) ఆరు వికెట్లు తీయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. దీంతో డెబ్యూలోనే ఐదు వికెట్ల ఘనతను అందుకున్న 10వ భారత బౌలర్‌గా మానవ్ సుతార్ నిలిచాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డు నరేంద్ర హిర్వాని పేరిట ఉంది. ఆయన 1988లో వెస్టిండీస్‌పై అరంగేట్ర మ్యాచ్‌లోనే తొలి ఇన్నింగ్స్‌లో (8/61) 8 వికెట్లు.. రెండో ఇన్నింగ్స్‌లో (8/75) 8 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత మానవ్ సుతార్ (6/33) 6 వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో మానవ్ సుతార్ 59 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు. 1967లో ఆస్ట్రేలియాతో అరంగేట్ర మ్యాచ్‌లో అబిద్ అలీ (6/55) 6 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో అతన్ని మానవ్ సుతార్ అధిగమించాడు.

స్కోరు బోర్డు

భారత్ తొలి ఇన్నింగ్స్ : 564/8 డిక్లేర్డ్ (గిల్ 126, రాహుల్ 100, సాయి సుదర్శన్ 81, పంత్ 81, వాషింగ్టన్ సుందర్ 52; సలీమ్ సఫీ 6/140)

ఆప్ఘనిస్థాన్ తొలి ఇన్నింగ్స్ : 152 (రహమత్ షా 60, షాహిది 20, సేదిఖుల్లా 17; సుతార్ 6/33, ప్రసిద్ధ కృష్ణ 3/37)

ఆప్ఘనిస్థాన్ రెండో ఇన్నింగ్స్ : 112 (అటల్ 42, గుర్బాజ్ 24, రహమత్ షా 13; వాషింగ్టన్ సుందర్ 4/36, కుల్దీప్ 3/30)