23 July, 2026 | 7:04 AM

బూతులు.. అరుపులు

29-06-2024 02:55 AM
  • వ్యక్తిగతంగా దూషించిన ట్రంప్
  • తడబడ్డ బైడెన్

న్యూఢిల్లీ జూన్ 28: అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ బైడెన్ మధ్య భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం చర్చ జరిగింది. అట్లాంటాలోని సీఎన్‌ఎన్ ప్రధా న కార్యాలయంలో వీరి మధ్య చర్చ జరిగింది. ఈ చర్చలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మీద వ్యక్తిగత దూషణకు దిగారు. ట్రంప్ దూకుడు ప్రదర్శించగా, జో బైడెన్ మాత్రం తనదైన శైలిలో మరోసారి తడబడ్డారు. కనీసం వీరు ఒకరితో ఒకరు కరచాలనం కూడా చేసుకోకపోవడం గమనార్హం. ఈ చర్చా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ఎవరూ వీక్షించలేదు. దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన డిబేట్‌లో ఆడియన్స్ ఎవరూ లేరు.

ఒకరు మాట్లాడుతుండగా.. మరొకరి మైక్‌ను నిర్వాహకులు కట్ చేశారు. బైడెన్ ఓ ఫెయిల్యూర్ అని మాజీ అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించగా.. ట్రంప్ దోషి అంటూ బైడెన్ విరుచుకుపడ్డారు. ఈ చర్చా కార్యక్రమంలో ట్రంప్ మొత్తం 23 నిమిషాల ఆరు సెకండ్లు మాట్లాడగా.. బైడెన్ మాత్రం కేవలం 18 నిమిషాల 26 సెకండ్ల పాటు మాత్రమే మాట్లాడారు. ఈ ఇద్దరి మధ్య అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. బైడెన్ చర్చను నెమ్మదిగా ప్రారంభించారని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా ఒప్పుకున్నారు. ఈ చర్చలో ట్రంప్ బైడెన్ మీద పై చేయి సాధించినట్లు సీఎన్‌ఎన్ చానల్ నిర్వహించిన పోల్‌లో ఆడియన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.