గ్రేటర్‌లో భారీగా విద్యుత్ డిమాండ్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 1 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న ఉష్టోగ్రతల కారణంగా రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతోంది. గ్రేటర్‌వ్యాప్తంగా బంజారాహిల్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్, సైబర్‌సిటీ, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, మేడ్చల్, హబ్సీగూడ సర్కిల్స్ పరిధిలో 60.92 లక్షల విద్యుత్ వినియోగదారులు ఉండగా, వీరిలో 50.14 లక్షలు గృహ అవసరాల కోసం, మిగతా నాన్ డొమెస్టిక్ పద్ధతిలో విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. ఈ పరిధిలో గత మూడేళ్లుగా విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతూ వస్తోంది. 2022 ఏప్రిల్ 28 నాటికి 3,435 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, అదే ఏడాది ఏప్రిల్ 27న అత్యధికంగా 71.49 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. 2023లో అత్యధికంగా మే 19వ తేదీకీ 3,756 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, అదే రోజు అత్యధికంగా 79.33 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగదారులు వినియోగించారు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది 2024లో అత్యధికంగా (ఏప్రిల్ 30) 4,214 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కాగా, రికార్డు స్థాయిలో 88.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదయ్యింది. 2023లో సరాసరి విద్యుత్ డిమాండ్ 2,952 మెగావాట్లు కాగా, 2024లో సరాసరి 3,991 మెగావాట్లుగా ఉంది. దీంతో 2023 కంటే 2024లో 35.19 మెగావాట్ల అదనపు విద్యుత్ డిమాండ్ పెరిగింది. కాగా, 2023లో సరాసరి 60.57 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదు కాగా, 2024లో సరాసరి 84.12 మిలియన్ యూనిట్లు పెరిగినట్టుగా స్పష్టమవుతోంది. 2023 కంటే అదనంగా 38.89 శాతం విద్యుత్ వినియోగం పెరిగింది.
2023లో ...
తేదీ మెగావాట్ల విద్యుత్ మిలియన్ యూనిట్లు
ఏప్రిల్ 26 3,048 58.33
ఏప్రిల్ 27 3,112 64.38
ఏప్రిల్ 28 3,109 66.03
ఏప్రిల్ 29 2,894 60.01
ఏప్రిల్ 30 2,598 54.09
సరాసరి 2,952 60.57
2024లో...
తేదీ మెగావాట్ల విద్యుత్ మిలియన్ యూనిట్లు
ఏప్రిల్ 26 3,952 84.02
ఏప్రిల్ 27 3,889 83.04
ఏప్రిల్ 28 3,768 78.47
ఏప్రిల్ 29 4,133 86.33
ఏప్రిల్ 30 4,214 88.75
సరాసరి 3,991 84.12




