ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ అర్హత పరీక్షకు భారీ స్పందన
దాదాపు 3,500 మంది అభ్యర్థులు హాజరు
300 మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. ఆదివాసీ అభ్యర్థులకు ప్రత్యేక ప్రాధాన్యత
పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్, ఆగస్టు 23(విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఎస్త్స్ర, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించనున్న ఉచిత కోచింగ్కు సంబంధించి ఆదివారం నిర్వహించిన అర్హత పరీక్షకు భారీ స్పందన లభించింది. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన నలంద కళాశాల, శ్రీ చైతన్య, చావర పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలకు 3,446 మంది అభ్యర్థులు అర్హత పరీక్షకు హాజరయ్యారు.
అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్ష కేంద్రాల వద్ద దాదాపు 200 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, అభ్యర్థుల రాకపోకలు, పరీక్ష కేంద్రాల వద్ద భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. పరీక్షల నిర్వహణను, పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను, అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అర్హత పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థులు, జిల్లాకు చెందిన ఆదివాసీలను ఎంపిక చేసి దాదాపు 300 మంది అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.
ఇందులో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పించి, వారికి పోటీ పరీక్షల్లో మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల్లో మెరుగైన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా పోలీ సుల ఆధ్వర్యంలో ఈ ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రతిభ కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎస్త్స్ర, కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న నలంద కళాశాల ప్రిన్సిపల్ పున్నారావు, అకాడమీ సిబ్బంది, శ్రీ చైతన్య పాఠశాల సిబ్బంది తదితరులకు జిల్లా ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎం. వెంకట నరసయ్య, సీఐలు బీడీ ప్రేమ్ కుమార్, రహీం పాషా, ప్రణయ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి. వెంకటి, రూరల్ ఎస్త్స్ర విష్ణువర్ధన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






