10 July, 2026 | 2:06 AM

మానవ ప్రేరేపిత ప్రకృతి విలయాలు

10-07-2026 12:00 AM

పర్వతాలు, సంద్రాలు, నదీనదాలు, అరణ్యాలతో జీవవైవిధ్యంతో, భౌగోళిక వైరుధ్యాలతో సకల జీవరాశుల మనుగడ సజావుగా సాగుతున్న తరుణంలో మానవ స్వార్థం బుసలు కొట్టింది. పచ్చదనాన్ని సంహరించింది. అరణ్యాలు నశించాయి. కొండలు పిండి అయ్యాయి. కాంక్రీటు కట్టడాలు వెలిశాయి. భూగర్భాన్ని విచ్ఛిన్నం చేసి బంగారు బాతు లాంటి సంపదలను దోచేసి, ధరిత్రికి వ్యథ కలిగించాం. కొండలనే కాదు, లోయలను కూడా స్వార్థానికి వినియోగించుకున్నాం. సముద్రాలు, నదులన్నీ వ్యర్థాలతో నిండిపోయాయి. మానవ జ్ఞానం ప్రకృతిని కాలదన్ని ఆధిపత్యం చెలాయించింది. దాంతో ప్రకృతి సమతుల్యం దెబ్బతిన్నది.

మానవ స్వార్థంతో ప్రకృతి క్షోభించింది. తప్పటడుగులను సరిచేసుకోవాలని పర్యావరణం హెచ్చరించింది. అవి తప్పటడుగులు కావు, తప్పుటడుగులని అవగతమైనది. ప్రకృతి ఆగ్రహించింది. ప్రళయ గర్జన చేసింది. ప్రకృతి విలయంలో మానవ ప్రాణ దీపాలు ఆరిపోతున్నాయి. సుగంధాలు అద్దుకున్న మానవ దేహాలు శవాల గుట్టలై బురదలో దిగబడి దుర్గంధాన్ని వ్యాపింపజేస్తున్నాయి. 

ఇటీవల కేరళలోని వయనాడ్‌లో సంభవించిన ప్రకృతి ఉత్పాతం గతంతో పోల్చి చూస్తే, తక్కువ ప్రాణనష్టంతో బయటపడినందున సంతసించాలో, గతం నుంచి పాఠాలు నేర్చుకోనందుకు విచారించాలో అవగతం కావడం లేదు. గతం పునారావతమైనది. వయనాడ్ మరోసారి ప్రకృతి విలయానికి నిదర్శనంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోలను వీక్షిస్తుంటే  ఒళ్లు గగుర్పొడుస్తున్నది. రెప్పపాటు కాలంలో జరిగి న ప్రకృతి విలయం అత్యంత భయానకంగా ఉంది.

ఈ హఠాత్ పరిణామం ప్రకృతి విలయాలను ఎదుర్కోవడానికి పటిష్ఠమైన కార్యాచరణ అవసరమనే భావన కలిగించింది. మానవ ప్రయత్న లోపం జరగరాదని హెచ్చరించింది. 2024 ప్రకృతి విలయ విధ్వంసం లో వయనాడ్ కకావికలమైపోయింది. అలాం టి  పరిస్థితి మరోసారి ఉత్పన్నం కావడం బాధాకరం. ప్రకృతి విపత్తుల వలన సంభవిస్తున్న పరిణామాలను ప్రపంచంలోని పలు దేశాల్లో చూస్తూనే ఉన్నాం. ఈ అనర్థాల అనుభవాలను పాఠాలుగా స్వీకరించి, విపత్తులను ఎదుర్కోవడానికి, నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించడానికి అంతర్జాతీయ వేదికలు కృషి చేస్తున్నాయి.

మానవ మేధస్సు కంటే ప్రకృతి అత్యంత బలీయమైనది. ఎన్నో పరిశోధనలు జరిగినా, ఎన్నో ఆవిష్కరణలు జరిగినా ఇప్పటి వరకు మానవుడు మృత్యువును, ప్రకృతిని జయించలేకపోయాడు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వలన, ప్రకృతి విపత్తుల వలన సంభవించే ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని పూర్తిగా నివారించలేకపోయినా కనీస స్థాయికి తగ్గించే అవకాశాలున్నాయి. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి, నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించడానికి ఐరాస కూడా తన వంతు కృషి చేస్తున్నది.

ప్రకృతిలో సంభవించే తీవ్రమైన పరిణామాన్ని, మహా ప్రమాదాన్ని ‘విపత్తు’ అని నిర్వచించవచ్చు. ప్రపంచాన్ని ఎలాంటి విపత్తులు లేకుండా కాపాడాలనే మానవ సంకల్పానికి వికల్పమే వైపరీత్యం. వర్తమాన ప్రపంచంలో ప్రకృతి విపత్తులు చాలా వరకు మానవ తప్పిదాల కారణంగానే సంభవిస్తున్నాయి. వరదలు, భూకంపాలు, తుఫానులు, సునామీలు ఇత్యాధులన్నీ సహజ విపత్తులు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు నష్టం కలిగించి, విధ్వంసం చేసి, కోలుకోలేని విధంగా మానవజీవితాలను అతలాకుతలం చేసిన అనేక సంఘటనలు ఈ ప్రపంచంలో సంభవించాయి.

జనజీవనానికి తీవ్ర విఘాతం కలిగించి, జీవనోపాధిని దెబ్బతీసి, ప్రాణాలకు, ప్రభుత్వ, ప్రజల ఆస్తులకు నష్టం కలిగించడంలో విపత్తుల పాత్ర అధికం. ప్రకృతి వైపరీత్యాల నుంచి కోలుకుని, జనజీవనం సాధారణ స్థితికి రావడానికి సుదీర్ఘకాలం పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రజాజీవనాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వాలు, జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల అవసరం ఉంది. మానవ జీవితాలను అతలాకుతలం చేసే ఇలాంటి ప్రమాదాలన్నీ సాధారణ స్థాయిని దాటి తీవ్రమైన స్థితికి చేరడం వలన  ప్రాణనష్టం జరుగుతున్నది. 

ప్రకృతి వైపరీత్యాల్లో వాతావరణ, పర్యావరణ, సంబంధమైన అంశాలు మిళితమై ఉన్నాయి. ప్రస్తుతం ఏర్పడుతున్న వైపరీత్యాల్లో మానవ ప్రేరిత వైపరీత్యాలదే సింహభాగం. వయనాడ్‌లో సంభవించిన ప్రకృతి విలయం అనేక మంది ప్రాణాలను హరించింది. ప్రకతి గర్జించి మానవ విజ్ఞానాన్ని ప్రశ్నించింది. మానవాధిపత్యానికి మరణశాసనం లిఖించింది. సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా పెరిగినా, మానవ జీవితం ఎంత సౌకర్యవంతంగా మారినా, ప్రపంచాన్ని మన గుప్పెట్లో బంధించినా, ఒక్క పెనుగాలికి మహా వక్షాలు నేలకొరగక తప్పవు.

మనం నిర్మించుకున్న ఆకాశహర్మ్యాలు నేలమట్టం కాకతప్పవు. ప్రకృతి విలయం ముందు మన విజ్ఞానం మూగబోక తప్పదు. ప్రకృతి ప్రళయ నాదానికి ప్రాణాలు గాలిలో దీపంలా మారి, ఆరిపోకతప్పదని చెప్పడానికి వయనాడ్‌లో గతంలోను, వర్తమానంలోను సంభవించిన, సంభవిస్తున్న విలయాలే ప్రత్యక్ష తార్కాణాలుగా పేర్కొన్నవచ్చు.

రెండేళ్ల కిందట ఊహాతీతంగా వయనాడ్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి, రాత్రికి రాత్రే వందలాది మంది ప్రజలు మృత్యువాతపడ్డారు. కుంభవృష్టికి తోడు కొండచరియలు విరగడం, బురద నీరు వరదలా ప్రవహించి, అందులో కూరుకుపోయి ప్రజలు మరణించడం, చాలా మంది వలస కూలీల జాడ కనిపించకపోవడంతో వయనాడ్ నాడు మరుభూమిగా మారిపోయింది. స్వల్ఫవ్యవధిలోనే భారీ విధ్వంసం జరగిన విషయం నేటికీ మన స్మృతిపథం నుంచి  దూరం కాలేదు. పొంగుతున్న నదులు, కొట్టుకొస్తున్న శవాలు, శిథిలాల కింద శవాలు, బురద నీటి ఉధృతికి తెగిపడిన శరీర భాగాలతో ‘గాడ్స్ ఓన్ కం ట్రీ’గా పేరొందిన కేరళ కకావికలమైంది.

ఎందుకిలా జరిగింది? ఈ ప్రళయానికి కారణాలేమిటి? అని విశ్లేషిస్తే, మానవ తప్పిదాలే ఈ విలయానికి కారణమని చెప్పక తప్పదు. సముద్రాలు వేడెక్కడం, భూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడం వలన వాతావరణంలో  మార్పులు సంభవించి, ఆకస్మికంగా భారీ వర్షాలు పడి, వరదలు సంభవించడం వంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. అందమైన పశ్చిమ కనుమల మధ్య ప్రకృతి విలయతాండవం చేయడం, వయనాడ్ ప్రకృతి విధ్వంసానికి చిగురుటాకులా వణికిపోవడం అత్యంత బాధాకరం. 

ప్రకృతి విలయాలను ఆపే శక్తి మనకు లేకపోయినా, ఇలాంటి విలయాల వలన జరుగుతున్న ప్రాణనష్టాన్ని ముందు జాగ్రత్త చర్యలతో కొంతవరకు అడ్డుకట్ట వేయవచ్చు. భాతాపాన్ని అరికట్టడం, ప్లాస్టిక్‌ను నిషేధించడం వంటి చర్యలతో పాటుగా వాతావరణంలో సంభవిస్తున్న అవాంఛనీయ మార్పులకు గల కారణాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంచనా వేయాలి. వాతావర ణ శాఖ అత్యంత పటిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసుకుని, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలి. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేయాలి. అప్పుడే మానవుడు సృష్టించిన ఈ విపత్తులకు అడ్డుకట్ట వేసి జీవజాలం మనుగడ సాధ్యపడుతుంది.

వ్యాసకర్త: విశ్లేషకుడు, 9704903463 

సుంకవల్లి సత్తిరాజు