27-10-2025 10:19:35 PM
ఉప్పల్ (విజయక్రాంతి): నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ డివిజన్ ప్రాంతంలో ఆడుకుంటూ వచ్చి తప్పిపోయిన ఒక బాలుడిని నాచారం పోలీసులు తల్లిదండ్రుల చెంతకు చేర్చి మానవత్వం చాటుకున్నారు. బాలుడు ఏడుస్తూ కనిపించడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. నాచారం సబ్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య సంఘటన స్థలానికి చేరుకొని బాలుడిని పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.
అనంతరం బాలుడి ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో పంచడంతో అతివేగంగా వైరల్ అయింది. దీంతో బాలుని తల్లిదండ్రులు ఆ సమాచారం ద్వారా తమ కుమారుని ఆచూకీ తెలుసుకొని నాచారం పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. అప్పటివరకు తమ బాలుడు ఎటు వెళ్ళాడు అని ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసు సహకారంతో తమ కుమారుడు క్షేమంగా చూసి ఆనంద భాష్పాలు పెట్టుకున్నారు. సబ్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య చూపించిన మానవత్వంకి బాలుడి తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు.