2 May, 2026 | 10:10 AM

మానవతా యోధుడు!

09-02-2025 12:00 AM

బాబా ఆమ్టే వర్ధంతి నేడు :

ఏకాగ్రత, నిరంతర సాధన, ప్రతి నిత్యం తాను సాధించవల్సిన అంశం గురించి ఆలోచించడం, ప్రతికూల పరిస్థితులను జాగ్రత్తగా అధిగమించ డం వంటివాటి ద్వారానే ఎవరైనా తమ లక్ష్యాన్ని చేరుకోవచ్చనే దానికి నిదర్శనం బాబా ఆమ్టే జీవితం. పద్మశ్రీ, పద్మవిభూషణ్, రామన్ మెగసెసే వంటి అత్యంత ప్రతిష్ఠాత్మక గౌరవాలను పొందిన మహనీయుడాయన. ఆయన అసలు పేరు మురళీధర్ దేవదాస్ ఆమ్టే.

అనేకమంది కుష్టురోగుల పాలిట దేవుడయ్యాడు. ఆ వ్యాధిగ్రస్తుల కోసం చంద్రాపూర్ జిల్లా లో ఆనంద్వన్ ఆశ్రమాన్ని స్థాపించి, వారితోపాటు అక్కడే జీవితాన్ని గడిపిన ధన్యజీవి ఆయన. 2008 ఫిబ్రవరి 9న ఆ ఆశ్రమంలోనే మృతి చెం దాడు. ఉన్నత కుటుంబంలో జన్మించినా పేదలకు, కుష్ఠురోగులకు జీవితాంతం సేవ చేశారు.

1914 డిసెంబర్ 26న మహారాష్ట్రలోని వార్ధా జిల్లా హింగన్‌ఘాట్ లో ఒక ఉన్నత దేశస్థ బ్రాహ్మణ జాగిర్దార్ కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచే ఆయనను అందరూ ‘బాబా’ అని పిలిచేవారు. నిజానికి అది తల్లిదండ్రులు పెట్టిన ముద్దు పేరు. న్యాయశాస్త్రంలో శిక్షణ పొంది అందులోనే అభ్యాసం ప్రారంభించారు.

భారత జాతీయోద్యమం, క్విట్ ఇండియా పోరాటాలలో అరెస్ట్ అయిన జాతీయ నేతల తరఫున కోర్టులలో వాదించేవారు. క్రమంగా మహాత్మాగాంధీ వైపు ఆకర్షితులైనారు. గాంధీజీతోపాటు కొంత కాలం సేవాగ్రం ఆశ్రమంలో గడిపారు. ఆ తరువాత జీవితాంతం వర కు గాంధీజీ సిద్ధాంతాలకే కట్టుబడ్డారు. వేషధారణలోనూ బాపూజీ వలె ఖద్దరు దుస్తులనే వాడేవారు.

శేషజీవితా న్నంతా అణగారిన వర్గాల కోసమే గడిపారు. గాంధీజీ వలెనే స్వయంసమృద్ధి గ్రామాలు ఉండాలని ఆకాంక్షించారు బాబా ఆమ్టే. దేశమంతా ఐక్యంగా ఉండాలంటూ 1985లో ఓ ఉద్య మాన్ని ప్రారంభించారు. 72 ఏళ్ల వయసులో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ దాదాపు 5,000 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లి దేశ ఐక్యత కోసం కృషి సల్పారు.

1971లో భారత ప్రభుత్వ పద్మశ్రీ, 1985లో రామన్ మెగసెసే, 1986లో భారత ప్రభుత్వ పద్మవిభూషణ్ పురస్కారాలతోపాటు 1999లో గాంధీ శాంతి బహుమతి, అంబేద్కర్ అంతర్జాతీయ అవార్డు వంటి మరెన్నో అవార్డులు, రివార్డులు పొందారు. తుదిశ్వాస వదిలే వరకు తాను నమ్మిన సిద్ధాంతాలకే కట్టుబడి, పాటుపడిన మానవతా యోధుడు ఆమ్టే.

 గడప రఘుపతిరావు