2 May, 2026 | 11:32 AM

స్వయంకృతాపరాధం

09-02-2025 12:00 AM

దేశ రాజధాని ఢిల్లీలో వరసగా నాలుగోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించాలనుకున్న ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆశలకు బీజేపీ చావుదెబ్బ కొట్టింది. దాదాపు 26 ఏళ్ల తర్వాత తిరుగులేని ఆధిక్యతతో ఢిల్లీ గద్దెపై కాషాయ జెండాను ఎగురవేసింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ అసెంబ్లీలోని 70 స్థానాల్లో 48 సీట్లు దక్కించుకొని ఘన విజయం సాధించింది.

బీజేపీ తుపాను ముందు  కేజ్రీవాల్ సహా మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సౌరభ్ భరద్వాజ్‌లాంటి పార్టీ అగ్రనేతలంతా కొట్టుకు పోయారు. బీజేపీ ఘనవిజయం వెనుక ఆ పార్టీ వ్యూహరచన, మోదీ చరిష్మా లాంటివి పని చేసాయనడంలో సందేహం లేదు. అయితే ఆప్ ఘోర పరాజయం పాలవడానికి కేజ్రీవాల్ స్వయంకృతాపరాధాలే కారణమనేది  విశ్లేషకుల అంచనా. ఆప్ పుట్టిందే అవినీతి వ్యతిరేక నినాదంతో.

అవినీతికి వ్యతిరేకంగా గాంధేయవాది అన్నాహజారే చేసిన ఉద్యమంతో ఎదిగి పార్టీని నెలకొల్పిన కేజ్రీవాల్ దేశంలో అవినీతి వ్యతిరేక ఉద్యమకారులకు ఆశాకిరణంగా కనిపించారు. అయితే జన్‌లోక్‌పాల్ అంటూ నినదించిన కేజ్రీవాల్ చివరికి అదే అవినీతి ఆరోపణల కారణంగా ఘోర పరాజయం పాలవడం గమనార్హం.

అవినీతికి తావులేని పాలన హామీతో అధికారంలోకి వచ్చిన ఆయన కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి తన అధికార నివాసానికి మరమ్మతులు చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజా ఎన్నికల్లో  బీజేపీకి అదే ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీని ప్రారంభించినప్పటినుంచీ ఆ పార్టీ అధికారాన్ని అనుభవించడం కూడా పరోక్షంగా పార్టీ పతనానికి ఒక కారణం.

పార్టీ ఏర్పాటయిన కొద్ది నెలలకే 2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో  ఎవరూ ఊహించని విధంగా 70 స్థానాలకుగాను 28 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఆ పార్టీ అధికార ప్రస్థానం మొదలైంది. అయితే కొద్దికాలానికే  ప్రభుత్వం పడిపోవడం, తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఏకంగా 67 స్థానాలను గెలుచుకుని ప్రధాన రాజకీయ పార్టీలకు సవాలు విసిరింది.

అధికారంలో కొనసాగిన అయిదేళ్ల కాలంలో విద్య, వైద్య రంగాల్లో పలు సంస్కరణల తీసుకు రావడంతో పాటు పాలనను సామాన్య ప్రజలకు చేరువ చేయడంతో 2020లో జరిగిన ఎన్నికల్లో కూడా 62 సీట్లు గెలుచుకుని కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 

అప్పటినుంచే కేజ్రీవాల్ పతనం ప్రారంభమైంది. ఢిల్లీ అంటే ఆమ్ ఆద్మీ కోటగా మార్చిన ఆయన ప్రభుత్వం వరస అవినీతి కుంభకోణాల్లో కూరుకు పోయింది. పలువురు మంత్రులతో సహా కేజ్రీవాల్ కూడా మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కేసులనుంచి బైటపడడానికే సమయమంతా వెచ్చించాల్సి రావడంతో పరిపాలన గాడి తప్పింది.

దీనికి తోడు లెఫ్టెనెంట్ గవర్నర్ సక్సేనాతో నిత్యం ఏదో ఒక అంశంపై పోరాటం చేయాల్సి వచ్చింది.  సామాన్య ప్రజల కనీస అవసరాలయిన తాగునీరు, డ్రైనేజి, రోడ్ల మరమ్మతులు లాంటి వాటిని గాలికి వదిలేశారంటూ విపక్షాలు చేసిన ప్రచారం విద్యాధికులు ఎక్కువగా ఉన్న ఢిల్లీ ఓటర్ల మనసు మార్చేలా చేసింది.

హర్యానా ప్రభుత్వం యమునా నది నీటిని విషంగా మార్చి సరఫరా చేస్తోందంటూ ఆయన చేసిన ప్రచారం పని చేయకపోగా బెడిసికొ ట్టింది. వీటన్నిటినీ మించి కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఆమ్‌ఆద్మీ పార్టీని తీర్చి దిద్దాలన్న కేజ్రీవాల్  అత్యాశ ప్రతిపక్ష కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్‌ను దూరం చేసుకునేలా చేసింది. అన్ని స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఆప్ ఓట్లకు భారీగానే గండికొట్టింది.

పంజాబ్‌లో సాధించిన విజయంతో జాతీయ స్థాయిలో ఎదగాలన్న కోరికే దీనికి కారణం. అనతి కాలంలో జాతీయ పార్టీ స్థాయికి ఎదిగిన ఆ పార్టీ ఇప్పుడు దాన్ని కోల్పోయే స్థితికి చేరుకుంది. ఇప్పటికైనా కేజ్రీవాల్ అహాన్ని వదిలిపెట్టి ప్రతిపక్షాలను కలుపుకొని వెళ్లకపోతే పార్టీ ఉనికికే ప్రమాదం తప్పదన్నది పరిశీలకుల అంచనా.